Ladakh: లద్దాఖ్‌లో చైనా బలగాలను పెంచుతోంది.. కానీ

తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం

Published : 02 Oct 2021 14:10 IST

లద్దాఖ్‌: తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె తెలిపారు. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉందని చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్‌ వెళ్లిన ఆయన అక్కడి ఫార్వర్డ్ శిబిరాలను పరిశీలించారు. నేడు గాంధీ జయంతిని పురస్కరించుకుని లద్దాఖ్‌ పర్వతశ్రేణుల్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఖాదీ మువ్వన్నెల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన నరవణె.. భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. ‘‘గత ఆరు నెలలుగా సరిహద్దుల్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 12 సార్లు ఉన్నతస్థాయి సైనిక చర్చలు జరిగాయి. త్వరలోనే 13వ రౌండ్ సమావేశం జరగనుంది. అయితే గత కొన్ని రోజులుగా తూర్పు లద్దాఖ్‌, ఉత్తర ఫ్రంట్‌ ప్రాంతాల్లో చైనా గణనీయంగా బలగాలను మోహరిస్తోంది. మన తూర్పు కమాండ్‌కు సమీపంలో పెద్ద ఎత్తున డ్రాగన్‌ సైన్యాన్ని మోహరించడం ఆందోళన కలిగించే అంశమే. అయితే సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాం. మాకు వస్తున్న నిఘా సమాచారంతో ఆయుధాలను మోహరిస్తూనే ఉన్నాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా భారత్‌ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంది’’ అని నరవణె వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని