China: డ్రాగన్‌ కుయుక్తులు.. సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు!

భారత్‌కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది.

Published : 29 Nov 2021 13:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు పాక్ కంటే చైనాతోనే అసలైన ముప్పుందన్న నిపుణుల హెచ్చరికలను నిజం చేస్తూ సరిహద్దుల్లో డ్రాగన్ కుయుక్తులకు పాల్పడుతోంది. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు ఉద్రిక్తతలకు ఆజ్యం పోసేలా సరిహద్దుల్లో భారీ నిర్మాణాలు చేపడుతోంది. తూర్పు లద్దాఖ్ వెంబడి రహదారులు సహా భారీ సైనిక నిర్మాణాలు చేపడుతూ భారత్‌ను చైనా పదే పదే కవ్వింపులకు గురిచేస్తోంది. చైనా ఎన్ని కుయుక్తులు పన్నినా ఎదుర్కొనేందుకు రెట్టింపు సన్నద్ధతతో ఉన్నట్లు భారత ఆర్మీ వెల్లడించింది.

తూర్పు లద్దాఖ్‌, ఈశాన్య రాష్ట్రాలలోని సరిహద్దుల విషయంలో భారత్‌, చైనా మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గల్వాన్ ఘటనతో ఈ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం తలెత్తింది. అయితే ఇరు దేశాల సైన్యాధికారుల చర్చలతో పరిస్థితులు కొంతమేర సద్దుమణిగినప్పటికీ.. పూర్తిగా సమసిపోలేదు. భారత్‌తో వివాదాల నేపథ్యంలో సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు చైనా సైనిక నిర్మాణాలు చేపట్టడం.. భారత్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధ సమయాల్లో భారీ ఎత్తున సైన్యాన్ని సరిహద్దులకు చేరవేసేందుకు వీలుగా తూర్పు లద్దాఖ్‌లో పెద్ద ఎత్తున సైనిక నిర్మాణాలను చైనా చేపడుతోంది. తూర్పు లద్దాఖ్‌కు ఆవల ఉన్న తమ భూభాగంలో చైనా రహదారులను నిర్మిస్తోంది. వాటిని ఇతర ప్రాంతాలకు అనుసంధానించడం ద్వారా యుద్ధ సమయాల్లో వేగంగా ఆయుధాలు, సైన్యాన్ని తరలించేందుకు వీలవుతుందని చైనా భావిస్తోంది. క్షిపణి రెజిమెంట్‌లను వేగంగా చేర్చేందుకు ఈ నిర్మాణాలను డ్రాగన్‌ చేపట్టినట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. కష్‌గర్‌, గర్‌గున్సా, హోటన్‌ సైనిక స్థావరాల వద్ద రహదారులను విస్తరించడంతోపాటు.. అక్కడ ఎయిర్‌ స్ట్రిప్స్‌ను సైతం నిర్మిస్తున్నట్టు పేర్కొన్నాయి.

గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది మరింత సన్నద్ధతతో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు చైనా ఆర్మీ సిద్ధమైంది. అతి శీతల ప్రాంతాల్లో షెల్టర్‌లను నిర్మించడంతోపాటు.. రోడ్లను నిర్మించడం ద్వారా ఆ ప్రదేశాలను ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేసింది. సరిహద్దుల్లో డ్రోన్‌ల వినియోగాన్ని చైనా గణనీయంగా పెంచినట్టు భారత సైన్యం తెలిపింది. ఎక్కువ విస్తీర్ణంలో నిఘా కోసం డ్రోన్‌లను మోహరించినట్టు చెప్పింది. భారత సరిహద్దులకు చైనా భారీగా బలగాలను తరలించినట్టు వివరించింది.

సరిహద్దుల్లో చైనా ఎన్ని కుయుక్తులకు పాల్పడినా.. ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్నట్టు ఆర్మీ వర్గాలు స్పష్టం చేశాయి. గతేడాది కంటే మెరుగైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నట్టు సైన్యం వెల్లడించింది. డ్రాగన్‌కు తగిన రీతిలో సమాధానం చెబుతామని ధీమా వ్యక్తం చేసింది. పాక్‌ సరిహద్దుల వెంబడి సైతం భారత సైన్యం అప్రమత్తంగా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. సరిహద్దుల్లో అతిశీతల పరిస్థితులు ఎదుర్కోనున్న నేపథ్యంలో బలగాలను మరింత బలోపేతం చేసేందుకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నట్టు సైన్యం పేర్కొంది.

Read latest National - International News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని