Corona Origin: డేటాను ‘డిలీట్‌’ చేస్తోన్న చైనా!

కరోనావైరస్‌ పరిణామ క్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది.

Published : 24 Jun 2021 20:10 IST

మరోసారి బయటపడిన చైనా కుటిల యత్నాలు

వాషింగ్టన్‌: ఏడాదిన్నర గడుస్తున్నా కరోనా వైరస్‌ మూలాలు యావత్‌ ప్రపంచానికి ఓ మిస్టరీగానే మారాయి. కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచే లీక్‌ అయ్యిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. వీటిని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనావైరస్‌ పరిణామ క్రమానికి సంబంధించిన నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్‌ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం. కొవిడ్‌ మూలాలపై ప్రపంచ ఆరోగ్యసంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ.. చైనా కుటిల యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు.

డజనుకుపైగా తొలగింపు..

కరోనా వైరస్‌ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన కరోనావైరస్‌ టెస్ట్‌ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్‌ జెస్సీ బ్లూమ్‌ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌లోని సీక్వెన్స్‌ రీడ్‌ ఆర్కైవ్‌(SRA) నుంచి వాటిని తొలగిస్తున్నట్లు జెస్సీ బ్లూమ్‌ పేర్కొన్నారు. తొలగించిన వాటిలో ఎక్కువగా వైరస్‌ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే  ఉందన్నారు.

కొవిడ్‌ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు జెస్సీ బ్లూమ్‌ తెలిపారు. ఇలా తొలగించడానికి సాంకేతిక కారణాలేమీ కనిపించలేదని.. కేవలం వైరస్‌ పరిణామక్రమంపై అస్పష్టత నెలకొల్పేందుకే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామని స్పష్టం చేశారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్‌లో కరోనా వైరస్‌ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్‌ ఆనవాళ్లు ఉన్నాయని జెస్సీ బ్లూమ్‌ తన నివేదికలో పేర్కొన్నారు.

మరోసారి దర్యాప్తునకు WHO సిద్ధం..

కొవిడ్‌ మూలాలపై ఇప్పటికే ఓసారి దర్యాప్తు జరిపిన ప్రపంచ ఆరోగ్యసంస్థ.. వైరస్‌ ఆనవాళ్లపై స్పష్టత ఇవ్వలేదు. వుహాన్‌ ల్యాబ్‌నుంచి లీకయ్యే అవకాశాలు లేవన్న WHO, జంతువుల నుంచి మానవులకు సోకి ఉండవచ్చని అభిప్రాయపడింది. అయితే, కొవిడ్‌ మూలాలపై WHO అస్పష్ట నివేదికపై అంతర్జాతీయ నిపుణులు తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా చైనాలో పర్యటించి మరోసారి పూర్తి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇదే సమయంలో కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయ్యిందని చెప్పేందుకు ఆధారాలున్నాయని పలు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెరికాతో పాటు అంతర్జాతీయ నిపుణులు కూడా ల్యాబ్‌నుంచి లీక్‌ అయ్యిందనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మూలాలపై మరోసారి దర్యాప్తు చేసేందుకు WHO సన్నద్ధమవుతోంది. ఇందుకు చైనా సహకరించకపోతే అంతర్జాతీయ సమాజం నుంచి ఒంటరి కావాల్సి వస్తుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులీవాన్‌ ఇటీవలే చైనాను హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని