Chicago: స్కూళ్లలో ఇక కండోమ్స్​ తప్పనిసరి!

అమెరికాలోని షికాగో పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్​ (సీపీఎస్‌) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనుంది....

Published : 13 Jul 2021 01:18 IST

షికాగో: అమెరికాలోని షికాగో పబ్లిక్​ స్కూల్స్ ఎడ్యుకేషన్​ (సీపీఎస్‌) బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఐదు, ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాలల్లో కండోమ్‌లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టనుంది. ఈ నిబంధన ఆ బోర్డు పరిధిలోని 600 స్కూళ్లకు​ ఈ విద్యా సంవత్సరం నుంచే వర్తించనుంది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

2020 డిసెంబర్​లోనే సీపీఎస్​ బోర్డు ఈ విధానాన్ని రూపొందించింది. సెక్స్​ ఎడ్యుకేషన్​లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నది బోర్డు అభిప్రాయం. ఇక నుంచి ఎలిమెంటరీ స్కూళ్లలో 250, హైస్కూళ్లలో 1000 వరకు కండోమ్‌లు​ అందుబాటులో ఉంటాయి. షికాగో ఆరోగ్యశాఖ సహకారంతో కండోమ్‌లను సరఫరా చేస్తారు. కండోమ్స్​ అందించడమే కాకుండా.. విద్యార్థులకు శరీర నిర్మాణ శాస్త్రం, కౌమార యుక్త వయసులో శరీరంలో కలిగే మార్పులు, లైంగిక ధోరణులు, లైంగిక ఆరోగ్యం వంటి  అంశాలను బోధిస్తారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసే తల్లిదండ్రులు బోర్డుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కల్పించింది సీపీఎస్.

ఆరోగ్యాన్ని సంరక్షించేందుకే చర్యలు

ఈ నిర్ణయంపై సీపీఎస్​ వైద్యుడు కన్నెత్​ ఫాక్స్​ మాట్లాడుతూ.. ‘ఆరోగ్యపరంగా సరైన నిర్ణయాలు తీసుకునే హక్కు ఎవరికైనా ఉంది. నిర్ణయాలకు తగ్గట్టు ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు వారికి సరిపడా వనరులు కావాలి. వాటినే మేము అందిస్తున్నాము. కండోమ్‌లు కావాలనుకున్నప్పుడు అవి అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని అనుకుంటున్నాం. ఇవి అందుబాటులో లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. లైంగిక సంక్రమణ వ్యాధులు, అవాంఛిత గర్భాలు వస్తాయి. అలా కాకుండా చూసుకోవడం కోసమే ఈ చర్యలు. దీనిపై కొంత వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అయినప్పటికీ సమాజం మారిందని నేను విశ్వసిస్తున్నా’ అని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత

ఐదో తరగతి విద్యార్థులకు కండోమ్స్ ఇవ్వాలన్న విధానాన్ని కొంతమంది తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఐదో తరగతి అంటే 12ఏళ్ల వయసుగల వారని, వారు ఇంకా చిన్నపిల్లలేనని పేర్కొంటున్నారు. అసలు పిల్లలకు కండోమ్స్​ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చిందని మండిపడుతున్నారు. తమ విధానాన్ని మార్చుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు. అదే సమయంలో మరికొందరు సీపీఎస్​ బోర్డు నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని