ఆ లెక్కన మనదేశంలో కరోనా మరణాలెన్నంటే?

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. గత కొద్ది రోజులుగా 20 వేలకు దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి.

Published : 06 Jan 2021 23:58 IST

 

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉంది. గత కొద్ది రోజులుగా 20 వేలకు దిగువనే రోజూవారీ కేసులు నమోదవుతున్నాయి. అలాగే గత 12 రోజులుగా మరణాల సంఖ్య 300లకు దిగువనే ఉంటుంది. మరోవైపు, కరోనా వైరస్ టీకాలకు ఆమోదం లభించడంతో దేశ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఉంది. ఈ క్రమంలో బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ట్విటర్ వేదికగా కరోనా వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని వివరించింది. 

భారత్‌తో సహా ప్రపంచ దేశాల్లో గత వారం రోజుల్లో ప్రతి పది లక్షల మందిలో సగటున నమోదయిన కొత్త కేసులు, మరణాలను గురించి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ లెక్కన భారత్‌లో ఒక మరణం మాత్రమే సంభవించినట్లు తెలిపింది. అదే సమయంలో యూకే(64), ఇటలీ(55), యూఎస్(55), ఫ్రాన్స్(35), రష్యా(25), బ్రెజిల్‌(23)లో వారం రోజుల్లో ప్రతి పది లక్షల మందిలో సగటున మృత్యు ఒడికి చేరుకున్న వారి సంఖ్యను గ్రాఫ్‌ రూపంలో వివరించింది. ఇదిలా ఉండగా..1,50,000 మరణాలు సంభవించిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి. ఇప్పటివరకు అమెరికాలో 3,57,377, బ్రెజిల్‌లో 1,97,732 మంది మరణించినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ వెల్లడించింది. 

కేసుల పరంగా చూసుకుంటే..
రోజూవారీ కేసులు పరంగా చూసుకుంటే..భారత్‌లో గత ఏడురోజుల్లో ప్రతి పదిలక్షల మందిలో సగటున 96 మందికి మాత్రమే కరోనా వైరస్ సోకినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొత్త కేసుల పరంగా చూసుకుంటే యూకే(5,654), యూఎస్(4,524), ఇటలీ(1,819) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో దేశంలో 18,088 మందికి కరోనా వైరస్ సోకగా..264 మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు 2.27 లక్షలుగా ఉండగా..రికవరీలు కోటి మార్కుకు చేరువయ్యాయి.

ఇవీ చదవండి:

41 దేశాలకు పాకిన కొత్తరకం కరోనా!

కరోనా: 99.97లక్షల మంది కోలుకున్నారు

 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని