Canada: 100 కోట్ల సముద్ర జీవుల మృత్యువాత

సముద్ర జీవులు మునుపెన్నడు లేనంత తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జలచరాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి....

Published : 14 Jul 2021 01:23 IST

ప్రశ్నార్థకమవుతున్న జలచరాల ఉనికి

ఒట్టావా: సముద్ర జీవులు మునుపెన్నడు లేనంత తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జలచరాల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఒక్క కెనడా తీరంలోనే దాదాపు 100 కోట్ల సముద్రజీవులు మృత్యువాత పడ్డాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోకపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో కెనడాలోని వాంకోవర్‌ తీరం మృత్యు దిబ్బగా మారింది. ఎటుచూసినా సముద్ర జీవుల కళేబరాలే దర్శనమిస్తున్నాయి. సముద్ర ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా ఒక్క కెనడా తీరంలోనే దాదాపు 100 కోట్ల జలచరాలు మృతిచెంది ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరణించిన సముద్ర జీవుల్లో కాపుష్కలే పెద్ద సంఖ్యలో ఉన్నట్లు సముద్ర జీవ శాస్త్రవేత్త క్రిస్‌ హార్లీ తెలిపారు. వీటితోపాటు సముద్ర నక్షత్రాలు, నత్తలు, క్లామ్స్‌ కూడా పెద్దసంఖ్యలో చనిపోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కళేబరాలు వాంకోవర్‌ తీరం నుంచి అమెరికాలోని వాషింగ్టన్‌ తీరం వరకు విస్తరించి ఉన్నట్లు తెలిపారు.

సముద్రంలోని జీవ వ్యవస్థలో కాపుష్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అత్యంత సున్నితంగా ఉండే ఇవి సముద్ర జీవరాశులకు ఆహారం, పోషకాలు అందిస్తుంటాయి. సముద్ర నక్షత్రాలు, సముద్ర బాతులకు కాపుష్కలు ప్రధాన ఆహార వనరుగా ఉన్నాయి. తీరం వెంట ఉండే ఈ జీవులు చిన్నచిన్న రేణువుల్ని వడబోస్తూ సముద్ర నీటిని స్వచ్ఛంగా ఉండేలా చేస్తాయి. సముద్ర ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల్ని ఇవి అస్సలు తట్టుకోలేవు. అందుకే సాగర తీరాల్లో ఇవి పెద్ద ఎత్తున మృతిచెందుతున్నట్లు క్రిస్‌ హార్లీ వివరించారు. సముద్రంలో 86 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు కాపుష్కలు ఉష్ణోగ్రతల్ని తట్టుకోగలవని పేర్కొన్నారు. అయితే కెనడా తీరం వెంట నీటి ఉష్ణోగ్రతలు 122 డిగ్రీల ఫారెన్‌హీట్‌ వరకు ఉన్నట్లు తెలిపారు.

భారీ సంఖ్యలో సముద్ర జీవులు మృత్యువాతపడటం పర్యావరణంపై పెద్దఎత్తున ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాతావరణ మార్పుల వల్ల సముద్ర జంతువులతోపాటు వృక్ష ఫ్లవకాలు సైతం ప్రభావితమవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపై తేలియాడే ఫ్లవకాలు అనేక సముద్ర జీవులకు ఆహార వనరుగా ఉన్నట్లు పేర్కొన్నారు. సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఇలాగే కొనసాగితే అనేక జీవుల ఉనికి ప్రశ్నార్థకమవుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల పర్యావరణం తీవ్రంగా ప్రభావితం అవుతోందని చెప్పడానికి ఈ కళేబరాల దిబ్బలే  సమాధానం చెబుతున్నాయని వాపోతున్నారు. వాతావరణ మార్పులను అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే పర్యావరణ సమతౌల్యత దెబ్బతినడంతోపాటు మానవాళికి జరిగే నష్టం కూడా అపారంగా ఉంటుందంటున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంతోపాటు అవసరమైన ఇతర చర్యల్ని ప్రపంచ దేశాలు తీసుకోవాలని కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని