Drone: జమ్ము సరిహద్దుల్లో డ్రోన్‌ 

జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది.

Updated : 02 Jul 2021 14:01 IST

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో మరోసారి డ్రోన్ల సంచారం కలకలం సృష్టించింది. శుక్రవారం అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఓ పాకిస్థాన్‌ డ్రోను మన దేశ భూభాగంలోకి ప్రవేశించేందుకు యత్నించింది. అయితే సరిహద్దు భద్రతా సిబ్బంది అప్రమత్తమై కాల్పులు జరపడంతో ఆ డ్రోన్‌ వెనుదిరిగినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ తెల్లవారుజామున 4.25 గంటల ప్రాంతంలో జమ్ము శివారులోని అర్నియా సెక్టార్‌లో ఓ చిన్న క్వాడ్‌కాప్టర్‌ అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు ప్రయత్నించింది. ఈ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వెంటనే ఆరుసార్లు కాల్పులు జరిపారు. దీంతో ఆ డ్రోన్‌ పాకిస్థాన్‌ వైపు వెళ్లిపోయిందని బీఎస్‌ఎఫ్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్‌ పంపి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. జమ్ములో అనుమానిత డ్రోన్లు సంచరించడం ఈ వారంలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

గత ఆదివారం తెల్లవారుజామున జమ్ము వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లోకి ప్రవేశించిన రెండు డ్రోన్లు బాంబులు జారవిడిచాయి. ఈ ఘటనలో భవనం పైకప్పు ధ్వంసమైంది. ఆ తర్వాత మరుసటి రోజే జమ్ములోని మరో సైనిక స్థావరంపై డ్రోన్‌ దాడిని సైన్యం భగ్నం చేసింది. రెండు రోజుల తర్వాత కాలూచక్‌, రత్నచక్‌ ప్రాంతంలో మరోసారి డ్రోన్లు కన్పించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు