Mask: బ్రెజిల్‌ అధ్యక్షుడికి జరిమానా

కరోనాపై ఎప్పుడూ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేసే బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో తాజాగా మాస్కు లేకుండానే ఓ ర్యాలీలో పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తూ మాస్కు లేకుండా....

Published : 13 Jun 2021 22:17 IST

బ్రెసీలియా: కరోనాపై ఎప్పుడూ నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేసే బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో తాజాగా మాస్కు లేకుండానే ఓ ర్యాలీలో పాల్గొన్నారు. కొవిడ్‌ నిబంధనలను అతిక్రమిస్తూ మాస్కు లేకుండా సావోపాలో రాష్ట్రంలో ద్విచక్రవాహనంపై ర్యాలీ నిర్వహించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా 100 డాలర్ల జరిమానాకు గురయ్యారు.

వచ్చే ఏడాది బ్రెజిల్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బోల్సొనారో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలోనే ఆయన సావోపాలో రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు పాల్గొన్నారు. ఓపెన్‌ హెల్మెట్‌ ధరించిన బోల్సొనారో మాస్కు మాత్రం ధరించలేదు. దీనిపై స్పందించిన సావోపాలో ప్రభుత్వం.. దేశాధ్యక్షుడికి వంద డాలర్ల జరిమానా విధించింది. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే అధ్యక్షుడికైనా జరిమానా తప్పదని రాష్ట్ర గవర్నర్‌ జోవ్‌ డోరియా పేర్కొన్నారు.

జైర్‌ బోల్సొనారో మొదటి నుంచి కరోనాపై నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. గతేడాది జులైలోనే ఆయనకు కరోనా సోకింది. అయినా నేను ఆరోగ్యంగానే ఉన్నానంటూ మాస్కు తొలగించి జర్నలిస్టులతో సమావేశమవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. మరో సమయంలో మాస్కు ధరించను అని కూడా చెప్పారు. బోల్సొనారో ప్రవర్తన పట్ల బ్రెజిల్‌ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా కట్టడిపై అశ్రద్ధ వహించారని.. అందుకే దేశంలో కొవిడ్‌ విజృంభించిందని ఆరోపిస్తున్నారు. అమెరికా తర్వాత కరోనా మరణాలు బ్రెజిల్‌లోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఇప్పటివరకు 4,85,000 మంది కొవిడ్‌తో మృతిచెందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని