COP26 Summit: జేమ్స్​బాండ్ కథతో ప్రపంచ దేశాలకు బ్రిటన్‌ ప్రధాని వార్నింగ్

భూమండలం మొత్తాన్ని నాశనం చేసే ఆయుధం చేతుల్లో ప్రపంచం చిక్కుకుందని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆందోళన వ్యక్తం చేశారు......

Published : 01 Nov 2021 21:02 IST

గ్లాస్గో: భూమండలం మొత్తాన్ని నాశనం చేసే ఆయుధం చేతుల్లో ప్రపంచం చిక్కుకుందని బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్​ ఇండస్ట్రియల్​​ రివల్యూషన్​ ప్రపంచం మొత్తానికి అవసరం ఉందని పేర్కొన్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ప్రపంచ వాతావరణ సదస్సును ప్రారంభించిన సందర్భంగా బోరిస్‌ జాన్సన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. వాతావరణ మార్పులను ఉద్దేశిస్తూ.. మొత్తం జీవజాలాన్ని నాశనం చేయగల ఆయుధం చేతుల్లో ప్రపంచం చిక్కుకుందని హెచ్చరించారు. ప్రస్తుతం భూమి ఉన్న పరిస్థితిని.. సీక్రెట్​ ఏజెంట్​ జేమ్స్​ బాండ్ స్థితితో ఆయన పోల్చారు​. భూమండలాన్ని తుడిచిపెట్టగల బాంబుతో చెలగాటమాడుతున్నామని.. దానిని ఎలా డిఫ్యూజ్​ చేయగలమనే దారులు వెతకాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

బ్రిటన్‌ ప్రధాని మాట్లాడుతూ.. ‘మనం జేమ్స్​బాండ్​ పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు యావత్​ ప్రపంచాన్ని నాశనం చేసే ఆయుధం ఊహాజనితం కాదు.. నిజం. గ్రీన్​ ఇండస్ట్రియల్​ రివల్యూషన్​ కోసం మనం చూస్తున్నాం. ఇప్పుడు అది ప్రపంచం మొత్తానికి అవసరం. అభివృద్ధి చెందిన దేశాలుగా మనపైన ప్రత్యేక బాధ్యత ఉంది. అందుకు ప్రతి దేశానికి సాయంగా నిలవాలి. 200 ఏళ్లుగా పారిశ్రామిక దేశాలు వారి ద్వారా ఉత్పన్నమవుతున్న సమస్యలను పెడచెవిన పెట్టాయి. పారిస్​లో ఇచ్చిన మాట ప్రకారం ఏటా 100 బిలియన్​ డాలర్లు సాయం చేసేందుకు మనం కృషి చేయాలి. అయితే.. దానిని సాధించేందుకు మరో రెండేళ్లు పట్టేలా కనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో వాతావరణ మార్పులపై అగ్రదేశాధినేతలు కొన్నింటికి మాత్రమే అంగీకారం తెలపటంపై ఆయన పెదవి విరిచారు.

63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పు

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయని తాజా నివేదిక ఒకటి తెలిపింది. 2015 నుంచి 2021 వరకు అత్యంత వేడి సంవత్సరాలుగా రికార్డుల్లోకి ఎక్కే అవకాశముందని వెల్లడించింది. కాప్‌-26 సదస్సు నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ తాజా నివేదికను విడుదల చేసింది. 2021కి సంబంధించి తొలి 9 నెలల వివరాలను అందులో పొందుపర్చింది. ఆ డేటాను బట్టి చూస్తే.. ఏడాది ముగిసేసరికి 2021 అత్యంత వేడి సంవత్సరాల జాబితాలో 5-7 స్థానాల మధ్య ఉండే అవకాశముందని పేర్కొంది. లా నినా ప్రభావంతో ఈ ఏడాది ఆరంభంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనా అలాంటి పరిస్థితులు ఉండటం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక యుగం ముందునాటితో పోలిస్తే 2021లో సగటు ఉష్ణోగ్రత 1.09 డిగ్రీల సెల్సియస్‌ మేర అధికంగా ఉందని తెలిపింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2100 కల్లా సముద్ర మట్టాల స్థాయి 2 మీటర్ల మేర పెరిగే అవకాశముందని.. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 63 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ముప్పుందని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని