సారీ ఇండియా.. రాలేకపోయాను!

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం జరుపుకుంటున్న గణంత్ర వేడుకతకు అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్‌ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో......

Updated : 26 Jan 2021 15:06 IST

రిపబ్లిక్‌ డే సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని ప్రత్యేక సందేశం

లండన్ ‌: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశం జరుపుకొంటున్న గణతంత్ర వేడుకలకు అతిథిగా హాజరయ్యే అవకాశం చేజారినందుకు బ్రిటన్‌ ప్రధాని ఒకింత విచారం వ్యక్తం చేశారు. అయితే, త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా యావత్‌ భారత ప్రజానీకానికి ఆయన 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘భారత్‌లో జరిగే విశిష్ట వేడుకలకు(గణతంత్ర దినోత్సవం) నా మిత్రుడు ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు హాజరవ్వాలని ఆసక్తిగా వేచిచూశాను. కానీ, కొవిడ్‌-19పై మనమంతా చేస్తున్న పోరాటం కారణంగా వేడుకలకు దూరంగా ఉండాల్సి వచ్చింది’’ అంటూ జాన్సన్‌ విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిపై ఇరు దేశాలు ఉమ్మడిగా చేస్తున్న పోరును ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. మానవాళికి పొంచి ఉన్న మహమ్మారి ముప్పు తొలగించేందుకు చేస్తున్న వ్యాక్సిన్ల తయారీలో ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు వెళుతున్నాయని తెలిపారు. త్వరలో కరోనాపై పోరులో విజయం సాధించబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీతో గతంతో కుదిరిన ఒప్పందం మేరకు ఉభయ దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలో భారత్‌కు వచ్చేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. కరోనా కారణంగా ప్రజలంతా దూరంగా ఉండాల్సి వస్తోందని గుర్తుచేశారు. బ్రిటన్‌, భారత్‌కు మధ్య వారధిగా ఉన్న అనేక మంది ప్రవాస భారతీయులు సైతం ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారన్నారు. ‘‘ఏదేమైనా, భారత్‌తో పాటు బ్రిటన్‌లో గణతంత్ర వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ తన సందేశాన్ని ముగించారు.

ఈసారి గణతంత్ర వేడుకలకు బోరిస్‌ జాన్సన్‌ అతిథిగా హాజరుకావాల్సి ఉండగా.. ఆయన దాన్ని రద్దు చేసుకున్నారు. బ్రిటన్‌లో కరోనా కొత్త రకం వెలుగులోకి రావడం.. అది అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో అక్కడ మరోసారి పరిస్థితులు దిగజారాయి. దీంతో, కరోనా కట్టడిని మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు బోరిస్‌ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

ఇవీ చదవండి...

మహవీరుడు మన సంతోష్‌ 

శ్రమ, త్యాగంతో దేశం వృద్ధి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని