BJP leader: ‘అఫ్గాన్ పో.. పెట్రోల్‌ చవకగా దొరుకుతుంది’

పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత ఒకరు విరుచుకుపడ్డారు. పెట్రోల్‌ చవకగా కావాలంటే పోయి అఫ్గాన్‌లో పోయించుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారు.

Updated : 20 Aug 2021 18:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుపై మధ్యప్రదేశ్‌కు చెందిన భాజపా నేత ఒకరు విరుచుకుపడ్డారు. పెట్రోల్‌ చవకగా కావాలంటే పోయి అఫ్గాన్‌లో పోయించుకో అంటూ ఉచిత సలహా ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

మధ్యప్రదేశ్‌లోని కట్ని జిల్లా నేత అయిన రామ్‌ రతన్‌ పాయల్‌ బుధవారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల గురించి ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు ప్రస్తావించడంతో ఆయన చిందులు తొక్కారు. ‘‘అఫ్గానిస్థాన్‌ వెళ్లవయ్యా. అక్కడైతే లీటర్‌ 50 రూపాయలకే దొరుకుతుంది. వెళ్లి అక్కడే పోయించుకుని రా. అక్కడ ఎవరూ పోయించుకోవడం లేదు కూడా. ఇక్కడైతే కనీసం పెట్రోల్‌ పోయించుకునే స్వేచ్ఛ ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు.

‘‘ఇప్పటికే రెండు దశల్లో కరోనా విజృంభణతో దేశం అల్లాడిపోయింది. దేశం అసలే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మూడో దశ వస్తుందని కూడా చెబుతున్నారు. ఈ టైమ్‌లో పెట్రోల్‌ గురించి మాట్లాడతావేంటయ్యా!’’ అంటూ క్లాస్‌ పీకారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు కూడా ఎవరూ కనీసం మాస్కులు ధరించకపోవడం వీడియోలో కనిపించింది. కానీ, ప్రజలెవరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం లేదంటూ ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కొసమెరుపు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని