Updated : 25/05/2021 13:06 IST

Corona: చైనాలో ఓ మిస్టరీ వైరస్‌ గుహ..! 

* కన్నెత్తి చూస్తే అరెస్టే..!


ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కరోనా మూలాలు చైనాలోని ఒక గుహలో ఉన్నాయని.. శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అక్కడి నుంచి ల్యాబ్‌కు చేరి ఆ తర్వాత జనాల్లోకి వ్యాపించిందనే వాదనకు బలం చేకూర్చేల అమెరికా ఇంటెలిజెన్స్‌ నివేదికలను తాజాగా వాల్‌స్ట్రీట్‌ బయటపెట్టింది. కానీ, చైనాలో సార్స్‌కు కారణమైన వైరస్‌ మూలాలు ఉన్న గుహను కనుగొన్నట్లు 2017లో ‘నేచర్‌’ పత్రికలో కథనం వెలువడటం గమనార్హం. పైగా భవిష్యత్తులో వ్యాపించే అంటు వ్యాధులకు ఇది కారణం కావచ్చని కూడా హెచ్చరించింది. ఈ కథనాన్ని నేచర్‌ పత్రికకు షాంఘైలో ఉన్న ఆసియా పసిఫిక్‌ కరస్పాండెంట్‌ డేవిడ్‌ సైరనోస్కీ  2017లో రాశారు.

2002లో 800 మరణాలతో గ్లోబల్‌ ఎమర్జెన్సీకి కారణమైన సార్స్‌ వంటి ఒక వైరస్‌ మూలాలను చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌లోని గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అక్కడ ఉన్న ‘హర్స్‌హు’ గబ్బిలాల్లో ఇవి ఉన్నాయి. భవిష్యత్తులో అంటువ్యాధులకు కారణం అయ్యే లక్షణాలు వీటిల్లో పుష్కలంగా ఉన్నాయని ‘ప్లోస్‌.ఓఆర్‌జీ’ పబ్లికేషన్‌లో ప్రచురించారు.

ఐదేళ్లపాటు పరిశోధన..

వాస్తవానికి  2002లో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో మొదలైన సార్స్‌ 2003 నాటికి ప్రపంచంలోని పలు దేశాలకు వ్యాపించింది. దీనికి కారణమైన కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ను గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో జంతుమార్కెట్‌లో విక్రయించే సివిట్‌ అనే జీవిలో గుర్తించారు.  ఆ తర్వాత హార్స్‌హు గబ్బిలాలు వీటికి మూలావాసాలుగా గుర్తించారు. ఈ క్రమంలో వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీకి చెందిన షి జంగ్‌ లీ, క్యూ జీ అనే శాస్త్రవేత్తల నేతృత్వంలోని బృందం దేశ వ్యాప్తంగా వేలాది గబ్బిలాల నుంచి నమూనాలు సేకరించారు.

2012 ఏప్రిల్‌లో యునాన్‌ ప్రావిన్స్‌లోని మోజియాంగ్‌లోని టోంగ్‌గువాన్‌లో కొందరు కూలీలు గబ్బిలాల విసర్జితాలను తొలగిస్తూ జబ్బుపడ్డారు. వీరిలో సార్స్‌ వంటి లక్షణాలు కనిపంచాయి. ముగ్గురు మరణించారు. బతికిన వారిని పరిశీలించగా.. సార్స్‌కు వచ్చే యాంటీబాడీలు వారి శరీరంలో ఉన్నాయి. ఈ క్రమంలో యునాన్‌ ప్రావిన్స్‌లోని గుహలో సేకరించిన నమూనాల్లోని కరోనా వైరస్‌ మనుషులకు సోకిన వైరస్‌ను పోలి ఉంది. వారు ఈ గుహల్లోని గబ్బిలాలపై ఐదేళ్లపాటు పరిశోధించారు. ఆ గబ్బిలాల మలం నమూనాలు, మలద్వార స్వాబ్‌ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.

15 వైరల్‌ స్ట్రెయిన్స్‌ గుర్తింపు..

ఇలా సేకరించిన నమూనాల్లో 15వైరస్‌ల నమూనాల జన్యువులను విశ్లేషించారు. ఇవి ఏ ఒక్కటీ ఒకదానికి మరొకటి పూర్తిగా సరిపోలలేదు. కానీ, వీటిల్లో మనుషులకు సోకడానికి అవసరమైన వేర్వేరు జన్యువులు ఉన్నాయి. వాటిని కలిపితే మనుషులను సోకడానికి అనుకూలంగా ఉన్నాయి. కానీ, ఇవేవి సార్స్‌ వైరస్‌ను పోలిలేవని నేచర్‌ పత్రిక కథనంలో  పేర్కొంది.

ఎవరినీ అనుమతించని చైనా..

సార్స్‌కోవ్‌-2 వైరస్‌ ప్రపంచం మీద పడి అల్లకల్లోలం సృష్టించడంతో చైనా అప్రమత్తమైంది. కొత్త రకం కరోనావైరస్‌లను కనుగొన్న యునాన్‌ ప్రావిన్స్‌లోని గుహలకు భద్రతను ఏర్పాటు చేసింది. ఆ చుట్టుపక్కలకు ఎవరూ రాకుండా కట్టడి చేయడం మొదలుపెట్టిందని 2020 డిసెంబర్‌ 30వ తేదీన కథనం ప్రచురితమైంది. అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించిన అసోసియేటెడ్‌ ప్రెస్‌ జర్నలిస్టులను భద్రతా సిబ్బంది వెంటాడి అడ్డుకొన్నారని పేర్కొంది. బీబీసీ బృందం అటు వెళ్లేందుకు ప్రయత్నించగా రోడ్డుకు అడ్డంగా ట్రక్కును పెట్టి అడ్డుకొన్నారు.

ఇక చైనా పరిశోధకులు ఈ గుహకు సంబంధించిన పరిశోధనా పత్రాలను మొత్తం ఓ టాస్క్‌ఫోర్స్‌కు సమర్పించాలి. ఆ టాస్క్‌ఫోర్స్‌కు చైనా అధ్యక్షుడు షీజిన్‌ పింగ్‌ నుంచి నేరుగా ఆదేశాలు అందుతాయి.  ఈ గుహ నుంచి సేకరించిన చాలా నమూనాలను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి తరలించినట్లు బీబీసీ ఒక కథనంలో పేర్కొంది.

ఇటీవల ఓ జర్నల్‌లో పనిచేసే రిపోర్టర్‌ సైకిల్‌పై ఎలాగొలా ఆ గుహల వద్దకు చేరుకొన్నాడు. కానీ, అక్కడ పోలీసులు అతన్ని అరెస్టు చేసి దాదాపు 5 గంటలపాటు ప్రశ్నించినట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. అతను సెల్‌ఫోన్‌లో తీసిన ఫొటోలను పోలీసులు డిలీట్‌ చేశారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను దాని గురించి మాట్లాడవద్దని హెచ్చరించారు.

కొవిడ్‌19 సీటీ స్కాన్‌ నివేదకలతో పోలిక..!

2012 ఏప్రిల్‌లో  యునాన్‌ ప్రావిన్స్‌లోని మోజియాంగ్‌లోని టోంగ్‌గువాన్‌ మైనింగ్‌ గుహలో అస్వస్థతకు గురైనా వారికి సిటీ స్కాన్‌ తీసి నిమోనియా సోకినట్లు గుర్తించారు. ఆ సీటీ స్కాన్‌లో వచ్చిన వంటి నిమోనియా గుర్తులే తాజాగా కొవిడ్‌19 సోకిన రోగుల సీటీ స్కాన్లలో వస్తున్నాయని వాల్‌స్ట్రీట్‌ కథనంలో పేర్కొంది.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని