డ్రోన్‌ నిబంధనలు సరళతరం.. కేంద్రం నోటిఫికేషన్‌.. ఎయిర్‌ ట్యాక్సీలకూ వీలు!

Drone rules: డ్రోన్‌ కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన నిబంధనలను కేంద్రం ప్రకటించింది. డ్రోన్ల వినియోగం కోసం దరఖాస్తు, వాడకంలో కొన్ని నిబంధనలను సడలిస్తూ కొత్త నిబంధనలను జారీ చేసింది.

Published : 26 Aug 2021 19:10 IST

దిల్లీ: దేశంలో డ్రోన్‌ (Drone) కార్యకలాపాల నిర్వహణను సులభతరం చేస్తూ నూతన నిబంధనలను కేంద్రం ప్రకటించింది. మానవరహిత విమాన వ్యవస్థ నిబంధనల స్థానంలో డ్రోన్‌ నిబంధనలు-2021 (Drone Rules) పేరిట వీటిని గురువారం వెలువరించింది. డ్రోన్ల వినియోగం కోసం దరఖాస్తు, వాడకంలో కొన్ని నిబంధనలను సడలించింది. దీనికి సంబంధించి జులై 15న ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై సలహాలు, సూచనలను స్వీకరించిన అనంతరం తాజా నిబంధనలన ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను కేంద్రం విడుదల చేసింది.

తాజా నిబంధనల ప్రకారం.. డ్రోన్ల వినియోగానికి ఇప్పుడున్న దరఖాస్తుల సంఖ్యను 25 నుంచి ఐదుకు తగ్గించింది. అలాగే రిజిస్ట్రేషన్‌కు, లైసెన్స్‌ జారీకి సెక్యూరిటీ క్లియరెన్స్‌ అవసరం లేదని పేర్కొంది. డ్రోన్లు గరిష్ఠంగా మోసుకెళ్లే సామర్థ్యాన్ని 300 కేజీల నుంచి 500 కేజీలకు పెంచింది. ప్రస్తుతం ఆపరేటర్ల నుంచి వసూలు చేస్తున్న 72 రకాల ఫీజుల స్థానే 4 రకాల ఫీజులనే వసూలు చేయనుంది. గ్రీన్‌ జోన్లలో 400 మీటర్ల వరకు ఎలాంటి అనుమతులూ అవసరం లేదని నిబంధనల్లో కేంద్రం పొందుపరిచింది. మైక్రో డ్రోన్ల వినియోగానికి ఎలాంటి పైలట్‌ లైసెన్స్‌ అక్కర్లేదని తెలిపింది. కార్గో డెలివరీలకు సంబంధించి త్వరలోనే డ్రోన్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.

త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలు!: సింథియా
ఇప్పుడు రోడ్లపై చూస్తున్న ట్యాక్సీల మాదిరిగానే త్వరలోనే ఎయిర్‌ ట్యాక్సీలను (Air Taxi) చూడబోతున్నామని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా పేర్కొన్నారు. డ్రోన్‌ నిబంధనల విడుదల సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘‘ఎయిర్‌ ట్యాక్సీల గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అనేక స్టార్టప్‌లు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు రోడ్లపై చూస్తున్న ట్యాక్సీల మాదిరిగానే ఎయిర్‌ ట్యాక్సీలనూ త్వరలో చూడొచ్చు. అందుకు తాజా డ్రోన్‌ నిబంధనలు వీలు కల్పిస్తున్నాయి. త్వరలోనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నా’’ అని సింథియా పేర్కొన్నారు. అలాగే కౌంటర్‌ రోగ్‌ డ్రోన్‌ టెక్నాలజీపై కేంద్ర రక్షణ శాఖ, హోంశాఖ, బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) కలిసి పనిచేస్తున్నాయని సింథియా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని