AstraZeneca: కరోనాపై కొత్త ఆయుధం సిద్ధం..!

కొవిడ్‌పై పోరుకు మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టీకాలు, రీపర్పస్‌ ఔషధాలు అందుబాటులో ఉండగా.. రీజనరాన్‌ సంస్థ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Published : 19 Nov 2021 14:10 IST

 ఆశలు రేపుతున్న ఆస్ట్రాజెనెకా కాంబో..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

కొవిడ్‌పై పోరుకు మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టీకాలు, రీపర్పస్‌ ఔషధాలు వినియోగంలో ఉండగా.. రీజనరాన్‌ సంస్థ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రభావవంతంగా ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. తాజాగా మరో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ కూడా అందుబాటులోకి రానుంది. ఆస్ట్రాజెనెకా ఇప్పటికే దీనికి సంబంధించి చేపట్టిన ప్రయోగాల్లో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. 

ఏమిటీ ఔషధం..?

ఏజెడ్‌డీ7442 (AZD7442) పేరుతో లాంగ్‌యాక్టింగ్‌ యాంటీబాడీలు (LAAB)ల మిశ్రమాన్ని ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసింది. కేవలం ఒక్క డోసుతోనే ఇది సానుకూల ఫలితాలను ఇస్తోందని పేర్కొంది. ఇప్పటికే ఆస్ట్రాజెనెకా - ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంతో కలిసి కొవిషీల్డ్‌ టీకాను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే కొన్ని రకాల యాంటీబాడీలకు సంబంధించి ఆస్ట్రాజెనెకా సంస్థ గతేడాది జూన్‌లో వాండర్‌బిల్ట్‌ యూనివర్శిటీ నుంచి హక్కులను కొనుగోలు చేసింది. వీటిల్లోని రెండు యాంటీబాడీల సమ్మేళనాన్ని ఏజెడ్‌డీ7442 పేరుతో అభివృద్ధి చేసి క్లినికల్‌ పరీక్షలు నిర్వహించింది. ఈ సమ్మేళనంలో ‘టిక్సాగేవిమాబ్‌’, ‘సిలగావిమాబ్‌’ అనే యాంటీబాడీలను వినియోగించింది. ప్రత్యేకమైన సాంకేతికతను వాడి ఆస్ట్రాజెనెకా వీటిని మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దింది. ఫలితంగా ఇవి సార్స్‌ కొవ్‌-2 వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లోని కీలక భాగాలను అంటిపెట్టుకొంటాయి. దీనికి తోడు సాధారణ యాంటీబాడీల కంటే ఇవి మూడు రెట్లు ఎక్కువ సమయం సచేతనంగా ఉంటాయి.  

ప్రయోగ ఫలితాలు ఇలా..

ఆస్ట్రాజెనెకా దీనిపై రెండు విధాలుగా ప్రయోగాలు చేపట్టింది. కొవిడ్‌ రాకుండా ఎంతవరకు అడ్డుకొంటుంది..? కొవిడ్‌ సోకిన ఔట్‌ పేషెంట్‌ చికిత్సలో ఎంత సమర్థంగా ఉపయోగపడుతుందన్న అంశాలపై మూడోదశ ప్రయోగ ఫలితాలు అందుబాటులోకి వచ్చాయి.

కొవిడ్‌ సోకకుండా ఎంతమేరకు అడ్డుకొంటుందనేది తెలుసుకొనే ప్రయోగాల్లో 300 ఎంజీ డోస్‌ను, ప్లాసిబో(డమ్మీ ఔషధం) వలంటీర్లకు ఇచ్చారు. అమెరికా, యూకే, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, బెల్జియంలో 87 ప్రదేశాల్లో 5,197 మందిపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. ఈ డోసు తీసుకొన్న వారిలో లక్షణాలతో కూడిన కొవిడ్‌ సోకే ముప్పు 83శాతం తగ్గిపోయింది.  

ఇక కొవిడ్‌ చికిత్సకు వినియోగించడంపై చేసిన ప్రయోగాల్లో పాల్గొన్నవారిలో 75శాతం ఇతర దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు (కోమార్బిడిటీస్‌) ఉన్నాయి. స్వల్ప, మధ్యస్థ లక్షణాలున్న మొత్తం 903 మంది ఈ ప్రయోగాల్లో పాల్గొన్నారు. ఏజెడ్‌డీ7442ని 600ఎంజీ చొప్పున వలంటీర్లకు ఇచ్చారు. దీంతో ప్లాసిబోతో పోలిస్తే ఔషధం తీసుకొన్న వారిలో 88 శాతం తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలు రాలేదు. అంతేకాదు, మరణాలు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో ప్లాసిబో తీసుకొన్నవారిలో ఐదుగురికి తీవ్రమైన లక్షణాలు వచ్చాయి.. ఇద్దరు మరణించారు. ఏజెడ్‌డీ7442 వల్ల దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉన్నాయని ఆస్ట్రాజెనెకా పేర్కొంది. 

ఆస్ట్రాజెనెకా నిపుణులు ఏమంటున్నారు..?

ఈ ప్రయోగ ఫలితాలను ఆస్ట్రాజెనికా నిపుణులు వర్చువల్‌ మీటింగ్‌లో ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో కనీసం 2శాతం మందికి టీకాల నుంచి తగినంత భద్రత అందకపోవచ్చని తెలిపారు. బ్లడ్‌ క్యాన్సర్‌, ఇతర క్యానర్లకు చికిత్స పొందుతున్న వారు, డయాలసిస్‌ చేయించుకొనేవారు, అవయవ మార్పిడి జరిగిన వారు, వ్యాధి నిరోధక శక్తి మందగించే ఔషధాలు వినియోగించేవారు ప్రమాదం అంచున ఉన్నారన్నారు. ఈ కొత్త ఔషధం వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని