Drugs Case: ఎన్‌సీబీ విచారణకు అనన్య డుమ్మా.. ఆర్యన్‌ లాయర్‌తో చర్చించిన గౌరీ

బాలీవుడ్‌ ఇండస్ట్రీని కుదిపేస్తోన్న డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నటి అనన్య పాండే నేడు ఎన్‌సీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో అరెస్టయిన్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్

Updated : 25 Oct 2021 20:22 IST

ముంబయి: బాలీవుడ్‌ను కుదిపేస్తోన్న డ్రగ్స్‌ కేసు వ్యవహారంలో నటి అనన్య పాండే నేడు ఎన్‌సీబీ విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో అరెస్టయిన్‌ షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్ ఖాన్‌ వాట్సాప్‌ చాటింగ్‌లో అనన్య పేరు రావడంతో ఎన్‌సీబీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. గతవారంలో రెండు సార్లు ఆమెను ప్రశ్నించిన అధికారులు.. సోమవారం మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు. ఉదయం 11 గంటలకు ఆఫీసుకు రావాలని చెప్పారు. అయితే ఇంతవరకూ ఆమె ఎన్‌సీబీ కార్యాలయానికి రాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల అనన్య నేడు విచారణకు హాజరుకావట్లేదని సమాచారం. 

లాయర్‌ను కలిసిన గౌరీ

ఇదిలా ఉండగా.. ఆర్యన్ కేసును వాదిస్తున్న లాయర్‌ సతీన్‌ మనెషిండేను షారుక్‌ ఖాన్‌ సతీమణి గౌరీ ఖాన్‌ సోమవారం కలిశారు. ఈ ఉదయం గౌరీ మన్నత్‌ నుంచి బయల్దేరారు. అయితే ఆమె.. జైల్లో ఉన్న తనయుడు ఆర్యన్‌ను కలిసేందుకు వెళ్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. కానీ ఆమె న్యాయవాదిని కలిసి కేసు పురోగతి గురించి చర్చించినట్లు సమాచారం.  

గతవారం షారుక్‌ జైలుకు వచ్చి కొడుకును కలిసివెళ్లిన విషయం తెలిసిందే. ముంబయిలో కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో అక్కడి జైళ్లలో నిబంధనలు సడలించి తమ వారిని కలుసుకునేందుకు వీలు కల్పించారు. దీంతో అక్టోబరు 21న షారుక్‌.. ఆర్థర్‌ రోడ్‌కు వచ్చి ఆర్యన్‌ను 15-20 నిమిషాల పాటు కలిసి ఇంటర్‌కామ్‌ ద్వారా మాట్లాడారు. కాగా.. నేడు షారుక్‌ - గౌరీల పెళ్లి రోజు కూడా. ఆర్యన్‌ జైలుకు వెళ్లినప్పటి నుంచి షారుక్‌ కుటుంబం ఇలాంటి వేడుకలకు దూరంగా ఉంటోన్న విషయం తెలిసిందే. కొడుకు ఇంటికొచ్చేదాకా మన్నత్‌లో స్వీట్లు కూడా వండొద్దని ఇప్పటికే గౌరీ తన సిబ్బందికి ఆర్డర్‌ వేశారు.

బెయిల్‌పై రేపు విచారణ..

మరోవైపు ఆర్యన్‌ బెయిల్‌పై బాంబే హైకోర్టులో మంగళవారం విచారణ జరగనుంది. ఈ కేసులో ఇప్పటికే మూడు సార్లు ఆర్యన్‌.. బెయిల్‌ కోసం ప్రత్యేక న్యాయస్థానంలో దరఖాస్తు చేసుకోగా కోర్టు దాన్ని తిరస్కరించింది. ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదక ద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లుగానే కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రత్యేక కోర్టు తీర్పు వెలువడగానే ఆర్యన్‌ తరఫున న్యాయవాదులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు అక్టోబరు 26న విచారణ చేపట్టనుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని