WHO: ‘జీవితాన్ని కోల్పోవడం కన్నా కార్యక్రమాలను రద్దు చేసుకోవడం మేలు’

ఒమిక్రాన్‌ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో పండగ సెలవుల నేపథ్యంలో బంధువులు, స్నేహితుల రాకపోకలు పెరిగినందున.. ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలను రద్దు చేయాల్సి రావొచ్చని...

Updated : 22 Dec 2021 10:02 IST

జెనీవా: ఒమిక్రాన్‌ కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో పండగ సెలవుల నేపథ్యంలో బంధువులు, స్నేహితుల రాకపోకలు పెరిగాయని..  ప్రస్తుత పరిస్థితుల్లో వేడుకలను వాయిదా వేసుకోవాలని సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్‌ అథానోమ్‌ కోరారు. తాజాగా జెనీవాలో ఆయన మాట్లాడుతూ.. ‘జీవితాన్ని కోల్పోవడం కంటే కార్యక్రమాలను రద్దు చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు సంబరాల్లో మునిగి, తర్వాత బాధ పడటం కంటే ఇప్పుడు రద్దు చేసుకొని, తర్వాత జరుపుకోవడం మంచిది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

చాలా దేశాల్లో ప్రస్తుతం ఇంటింటి రాకపోకలు పెరిగిన నేపథ్యంలో.. ఇవి మరిన్ని కేసులు, మరణాలకు దారితీస్తాయనడంలో సందేహం లేదని టెడ్రోస్‌ అన్నారు. దీంతోపాటు ఒమిక్రాన్‌.. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తోందనడానికి బలమైన ఆధారాలున్నాయని చెప్పారు. ఇప్పటికే టీకా తీసుకున్నవారికి, వైరస్‌ నుంచి కోలుకున్న వారికీ సోకుతోందని తెలిపారు. ఇదే సమావేశంలో సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ఒమిక్రాన్‌ను మునుపటి వేరియంట్లకంటే తేలికపాటిదని ఇప్పుడే నిర్ధారించడం అవివేకం అవుతోందన్నారు. ఈ కొత్త వేరియంట్ కొన్ని రోగనిరోధక వ్యవస్థలను తప్పించుకుంటోందని, ఈ నేపథ్యంలో బలహీన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారికి బూస్టర్ డోసులు ఇవ్వాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని