Covid Protocol: కరోనా ఆంక్షల అమలుపై షాకింగ్‌ సర్వే.. థర్డ్ వేవ్ తప్పదా?

కొవిడ్​ ఆంక్షలు, భౌతికదూరం, మాస్కుధారణ తదితర అంశాలపై నిర్వహించిన ఓ సర్వేలో విస్తురపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.....

Published : 31 Oct 2021 23:15 IST

దిల్లీ: కొవిడ్​ ఆంక్షలు, భౌతికదూరం, మాస్కుధారణ తదితర అంశాలపై నిర్వహించిన ఓ సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పండగల సీజన్​ దృష్ట్యా.. దేశంలోని చాలా ప్రాంతాల్లో కొవిడ్ ఆంక్షలు అమల్లో లేవని అత్యధిక మంది పౌరులు భావిస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మాస్కులు ధరించాలన్న నిబంధనను కేవలం రెండు శాతం మంది మాత్రమే కచ్చితంగా పాటిస్తున్నారని.. తమ ప్రాంతం, జిల్లాల్లోని మూడు శాతం మందే భౌతిక దూరం నిబంధనను అనుసరిస్తున్నట్లు భావిస్తున్నామని సర్వేలో పాల్గొన్నవారు పేర్కొన్నారు. లోకల్ సర్కిల్స్ అనే డిజిటల్​ సంస్థ దేశవ్యాప్తంగా 366 జిల్లాల్లో 20వేల మందిపై సర్వే నిర్వహించగా వారు ఈ విధంగా స్పందించారు.

సర్వేలో వెల్లడైన అంశాలు ఇవే..

* మాస్కు తప్పనిసరిగా ధరించాలన్న నిబంధనను కచ్చితంగా పాటిస్తున్నారని 2శాతం మంది భారతీయులు మాత్రమే భావిస్తున్నారు.

* తమ జిల్లాల్లోని ప్రజలు భౌతిక దూరం నియమాలను పాటిస్తున్నట్లు 3 శాతం మంది మాత్రమే అనుకుంటున్నారు. 

* సర్వేలో పాల్గొన్న 90శాతం మందికిపైగా పౌరులు.. తమ ప్రాంతంలో 2 శాతం మంది మాత్రమే మాస్కు ధరించటం, భౌతికదూరం పాటిస్తున్నట్లు తెలిపారు.

* ప్రయాణాల్లో భౌతిక దూరం పాటించటం లేదని మరో 9 శాతం మంది అభిప్రాయపడ్డారు.

* కేవలం 6 శాతం మంది మాత్రమే తమ ప్రాంతంలో భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తున్నారని పేర్కొన్నారు.

ఈ సర్వే సందర్భంగా సమాధానం ఇచ్చిన వారిలో 42శాతం మంది టైర్-1 జిల్లాలు, 30శాతం టైర్-​2 డిస్ట్రిక్స్‌, 23శాతం టైర్​-3 జిల్లాలు, టైర్-4 జిల్లాల నుంచి ఉన్నారు. 65 శాతం మంది పురుషులు, 35శాతం మంది మహిళలు ఈ సర్వేలో పాల్గొన్నారు. దీపావళి పండగ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్స్​లో కొవిడ్ ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తోందని సర్వే తెలిపింది. ప్రజలు కొవిడ్ ఆంక్షలను గాలికొదిలేస్తే.. దేశవ్యాప్తంగా కొవిడ్​ థర్డ్​ వేవ్ వ్యాప్తి అవకాశముందని అభిప్రాయపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని