Air Force: వాయుసేనకు మరో ఆరు నిఘా నేత్రాలు..!

భారత్‌ ఆకాశ మార్గంలో నిఘా ఏర్పాట్లపై దృష్టి సారించింది. దీనిలో భగంగా ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ మరో కీలక ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

Published : 10 Sep 2021 15:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆకాశ మార్గంలో నిఘా ఏర్పాట్లపై భారత్‌ దృష్టి సారించింది. దీనిలో భాగంగా ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ మరో కీలక ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. రూ.11 వేల కోట్ల వ్యయంతో రక్షణ రంగ పరిశోధన శాలలు (డీఆర్‌డీవో) ఆరు ఎయిర్‌ బొర్న్‌ ఎర్లీ వార్నింగ్‌ అండ్‌ కంట్రోల్స్‌ను అభివృద్ధి చేయడానికి అనుమతి మంజూరు చేసింది. మూడు బిలియన్‌ డాలర్లతో 56 సీ-295 రవాణా విమానాల కొనుగోలు డీల్‌కు ఇది అదనం.

సీసీఎస్‌ నిర్ణయంతో ఇప్పుడు డీఆర్‌డీవో రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయడానికి అవకాశం లభించింది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన విమానాలను ఎయిర్‌ ఇండియా నుంచి(ఏ-319 లేదా ఏ-321 విమానాలను) తీసుకొనే అవకాశాలు ఉన్నాయి. వీటిల్లో మార్పులు చేసి ఏఈడబ్ల్యూ అండ్‌ సీ వ్యవస్థలను అమర్చనున్నారు. దీంతోపాటు భారత్‌లో అభివృద్ధి చేసిన యాక్టివ్‌ ఎలక్ట్రికల్లీ స్కాన్డ్‌ ఆరే(ఏఈఎస్‌ఏ) రాడర్లను వీటిపైన  ఉంచే అవకాశం ఉంది.

ఇవి ఎలాంటి విధులు నిర్వహిస్తాయి..?

ఈ విమానాలు నిఘా నేత్రాల వలే పనిచేస్తాయి. ఆకాశంలో ఎగిరే అన్ని వస్తువులను గుర్తిస్తాయి. ఫైటర్‌ విమానాలు, క్రూజ్‌ క్షిపణులు, డ్రోన్లను భూమిపై అమర్చిన రాడార్ల కంటే చాలా ముందే గుర్తిస్తాయి. ఇది కీలక ఆపరేషన్లలో ఏరియల్‌ కంట్రోల్‌ రూమ్‌ వలే పనిచేస్తుంది. సముద్రంలో నౌకల కదలికలను ఓ కంట కనిపెడుతుంది.

భారత్‌ వద్ద ఇప్పటికే ఇజ్రాయెల్‌ తయారు చేసిన మూడు ఫాల్కన్‌ అవాక్స్‌ రాడార్లు ఉన్నాయి. వీటిని రష్యా తయారు చేసిన ఇల్యూషన్‌ -76 ట్రాన్స్‌పోర్ట్‌ విమానాలపై అమర్చారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు నేత్ర రాడార్లను కూడా వినియోగిస్తున్నారు. పాక్‌ వద్ద సాబ్‌-2000 ఎర్లీ వార్నింగ్‌ వ్యవస్థలు ఆరు ఉన్నాయి. దీంతో భారత్‌ కూడా వీటిపై దృష్టిపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని