ఉద్ధృతి తగ్గినా..తొలగని ముప్పు..!

దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ నిత్యం దేశవ్యాప్తంగా 25లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు.

Published : 19 May 2021 21:30 IST

కొవిడ్‌ పరీక్షలు పెంచాలంటున్న నిపుణులు
నిత్యం 25లక్షల కొవిడ్‌ పరీక్షలు చేస్తామన్న కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: దేశంలో కరోనా ఉద్ధృతి తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ నిత్యం దేశవ్యాప్తంగా 25లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 20లక్షల టెస్టులు నిర్వహించామని.. త్వరలోనే ఈ సంఖ్యను 25లక్షలకు పెంచుతామని స్పష్టం చేశారు. దేశంలో కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో సరైన పరీక్షలు జరగడం లేదని వస్తున్న విమర్శల నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ విధంగా స్పందించారు.

‘నిన్న జరిపిన 20లక్షల కొవిడ్‌ టెస్టులు ప్రపంచంలోనే అత్యధికం. త్వరలోనే వీటి సంఖ్యను 25లక్షలకు పెంచుతాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32కోట్ల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేశామన్నారు.

ఉద్ధృతి తగ్గినా..తొలగని ముప్పు

దేశంలో గత కొన్నిరోజులుగా పాజిటివ్‌ కేసులు తక్కువగా నమోదవుతున్నప్పటికీ సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి గరిష్ఠానికి(పీక్‌) చేరిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా వెలుగు చూసిన B.1.617 భారత్‌తో పాటు విదేశాల్లోనూ విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో సెకండ్‌ వేవ్‌ ప్రమాదం ఇప్పుడే ముగిసిందని చెప్పలేమని అభిప్రాయపడుతున్నారు.

‘దేశంలో చాలా ప్రాంతాలు కొవిడ్‌ గరిష్ఠ తీవ్రతను చూడలేదు. వైరస్‌ విస్తృతి ఇంకా కొనసాగుతూనే ఉంది’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ పాజిటివిటీ రేటు 20శాతం ఉండడం.. మరింత ముప్పు పొంచి ఉందనే విషయాన్ని తెలియజేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కొవిడ్‌ పరీక్షలు ముమ్మరంగా చేపట్టడం లేదు. పాజిటివిటీ రేటు భారీగా పెరగడం చూస్తుంటే.. మనం సరైన సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం లేదని స్పష్టంగా తెలుస్తోందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌమ్య స్వామినాథన్‌ వెల్లడించారు. అందుచేత కేవలం పాజిటివ్‌ కేసుల సంఖ్యను మాత్రమే చూడవద్దని.. ఎన్ని కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపితే అందులో పాజిటివ్‌ కేసులు ఎన్ని వస్తున్నాయో(పాజిటివిటీ రేటు) పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3లక్షల లోపు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కానీ, కొవిడ్‌ మరణాలు మాత్రం రికార్డు స్థాయిలో చోటుచేసుకుంటున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4529 మంది కొవిడ్‌ బాధితులు కన్నుమూశారు. దీంతో దేశంలో కొవిడ్‌తో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారిసంఖ్య 2లక్షల 83వేలు దాటింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని