Updated : 05/02/2021 13:19 IST

సాగుచట్టాల్లో ‘నలుపు’ ఏంటి?

రాజ్యసభలో వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌

దిల్లీ: సాగు చట్టాల్లో సవరణ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మరోసారి స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యంగా పంజాబ్‌లో సాగు చట్టాలపై ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని విపక్షాలను దుయ్యబట్టారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా తోమర్‌ నేడు రాజ్యసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన రైతుల ఆందోళన అంశంపై ఆయన ప్రసంగించారు. 

‘‘నల్ల’చట్టాలు అంటూ రైతు సంఘాలు, విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే వ్యవసాయ చట్టాల్లో నలుపు ఏముందని గత కొన్ని నెలలుగా నేను రైతు సంఘాల నేతలను అడుగుతున్నాను. వాళ్లు చెబితే నేను వాటిని సరిచేస్తాను’ అని తోమర్‌ అన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై కేంద్ర మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. కొత్త చట్టాలు అమలైతే మీ భూములు లాక్కుంటారంటూ కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారిని కావాలనే రెచ్చగొడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ఒప్పంద వ్యవసాయ చట్టం ద్వారా రైతుల భూములు దోపిడీకి గురవుతాయని చెప్పేలా ఒక్క నిబంధన అయినా ఉందా అని ప్రశ్నించారు. 

రైతుల శ్రేయస్సు కోసం తమ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని తోమర్‌ తెలిపారు. పంటలకు ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50శాతం ఎక్కువగా కనీస మద్దతు ధర కల్పిస్తున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ కింద వ్యవసాయ మౌలిక అవసరాల కోసం రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించామన్నారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడుల పెరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు.

గ్రామాల అభివృద్ధే లక్ష్యం..

‘పేద ప్రజల అనుకూల పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల జీవన స్థితిగతులను మార్చగలిగాం. గ్రామ పంచాయతీల కోసం రూ.2.36లక్షల కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను కేబినెట్‌ అంగీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలకు దాదాపు రూ.43వేల కోట్లు కల్పించాం. కరోనా విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధులను రూ. 61వేల కోట్ల నుంచి రూ. 1.115లక్షల కోట్లకు పెంచాం. ఈ పథకం ద్వారా 10కోట్ల మందికి పైగా లబ్ధి పొందుతున్నారు. సాంకేతికతతో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పారదర్శకత సాధించాం’ అని తోమర్‌ వెల్లడించారు. 

ప్రజలు.. ప్రభుత్వమే దేశ బలం

‘2020లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కొవిడ్‌ మహమ్మారి తెచ్చిన ఆంక్షలు ఆర్థిక వ్యవస్థ.. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఆ పరిస్థితులను దేశం కలిసికట్టుగా ఎదుర్కొంది. క్రమశిక్షణతో మహమ్మారిని తరిమికొట్టగలుగుతున్నాం. ప్రజలు.. ప్రభుత్వమే మన దేశ బలం అని చెప్పేందుకు ఆనందంగా ఉంది. కొవిడ్‌ పోరులో భారత్‌ విజయం సాధించింది. ఒకప్పుడు పీపీఈ కిట్లను తయారుచేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న మనం.. ఇప్పుడు వాటిని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం’ అని తోమర్‌ చెప్పుకొచ్చారు. 

ఇదీ చదవండి..

దేశ సరిహద్దులను వదిలి.. రైతుల ముందు మేకులా?

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని