Afghanistan bank: పేలేందుకు సిద్ధంగా అమెరికా టైంబాంబ్‌..!

అఫ్గాన్‌ బ్యాంకింగ్‌ రంగం కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలోని అఫ్గాన్‌ రిజర్వుల నిలిపివేత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ చీఫ్‌

Updated : 28 Sep 2021 16:45 IST

 కుప్పకూలేందుకు సిద్ధంగా అఫ్గాన్‌ బ్యాంకింగ్‌ రంగం

ఇంటర్నెట్‌డెస్క్‌: అఫ్గాన్‌ బ్యాంకింగ్‌ రంగం కుప్పకూలేందుకు సిద్ధంగా ఉంది. అమెరికాలోని అఫ్గాన్‌ రిజర్వుల నిలిపివేత ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ ‘ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌’ చీఫ్‌ సయ్యద్‌ మూసా అల్‌ ఖలీమ్‌ అల్‌ ఫలాహి తెలిపారు. దేశంలో ఫైనాన్షియల్‌ సెక్టార్‌ మనుగడ కోసం పోరాటం చేస్తోందన్నారు. కాబుల్‌లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల రీత్యా దుబాయ్‌లో ఉన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రజలు భారీ సంఖ్యలో నగదును విత్‌డ్రా చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చాలా బ్యాంకులు ప్రస్తుతం పనిచేయడంలేదు. తాలిబన్లు అధికారంలోకి రాకముందే  అఫ్గానిస్థాన్‌ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది.

అఫ్గాన్‌ ఆర్థిక వ్యవస్థలో దాదాపు 40శాతం వరకు విదేశీ సాయంగా అందే నిధులు, ప్రపంచ బ్యాంకు నిధులపైనే ఆధారపడి ఉన్నాయి. పశ్చిమ దేశాలు అంతర్జాతీయ నిధులను పూర్తిగా నిలిపివేశాయి. వరల్డ్‌ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి కూడా అఫ్గాన్‌ ప్రభుత్వం సొమ్ము తీసుకోకుండా చేశాయి. ఫలితంగా తాలిబన్లు నిధుల కోసం ఇతర మార్గాలపై ఆధారపడటం మొదలుపెట్టారని అల్‌ ఫలాహి తెలిపారు.

ముఖ్యంగా చైనా, రష్యా వంటి దేశాల నుంచి తాలిబన్లు నిధులు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా సుమారు 31 మిలియన్ల యువాన్ల సొమ్మును సాయంగా అందజేసింది. అయినా కానీ, ఆ మొత్తం దేశంలో ఆర్థిక సమస్యలు తీర్చడానికి తాలిబన్లకు ఏమాత్రం సరిపోలేదు.

మరోపక్క నార్వేజియన్‌ రిఫ్యూజీ కౌన్సిల్‌ కూడా అఫ్గాన్‌ ఆర్థిక స్థితిపై హెచ్చరికలు జారీ చేసింది. దేశంలో ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తోందని పేర్కొంది. బ్యాంకింగ్‌ వ్యవస్థ ఏ రోజైనా కుప్పకూలిపోవచ్చని హెచ్చరించింది. ‘‘దేశంలో నగదు లేకపోవడంతో చాలా కుటుంబాలు కేవలం టీ, మిగిలిపోయిన రొట్టెముక్కలతో పొట్టపోసుకోవడం చూశాను’’ అని ఎన్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్‌ జన్‌ ఎగిలాండ్‌ పేర్కొన్నారు. జన్‌ సెప్టెంబర్‌ 27న కాబుల్‌ను సందర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని