Covovax: టీకా ఉత్పత్తి ప్రారంభించిన సీరం!

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఉత్పత్తిని కొవొవాక్స్‌ పేరుతో భారత్‌లో ప్రారంభించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది.

Published : 25 Jun 2021 20:41 IST

 వెల్లడించిన సీరం అధినేత అదర్‌ పూనావాలా

దిల్లీ: ప్రపంచంలోనే వ్యాక్సిన్‌ తయారీ కేంద్రంగా ఉన్న భారత్‌, మరో మైలురాయిని చేరుకుంది. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఉత్పత్తిని కొవొవాక్స్‌ పేరుతో భారత్‌లో ప్రారంభించినట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. కరోనా వైరస్‌ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్‌ 90శాతం సమర్థత చూపించినట్లు ఈ మధ్యే విడుదలైన ఫలితాల్లో తేలింది.

‘కొవొవాక్స్‌ టీకా మొదటి బ్యాచ్‌ ఉత్పత్తిని పుణె కేంద్రంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిని కరోనా నుంచి రక్షించడంలో ఈ టీకా ఎంతో సమర్థత కలిగి ఉంది. ప్రస్తుతం వీటి క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతున్నాయి’ అని సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలా ట్విటర్‌లో పేర్కొన్నారు.

అమెరికాకు చెందిన నొవావాక్స్‌ అభివృద్ధి చేసిన ఈ టీకా కొవిడ్‌ను నిరోధించడంలో 90శాతం సమర్థత కలిగినట్లు ఈ మధ్యే వెల్లడైంది. ఓ మోస్తారు నుంచి తీవ్ర లక్షణాలున్న కేసుల్లో వైరస్‌ను వందశాతం ఎదుర్కొంటున్నట్లు తేలింది. అమెరికా, మెక్సికోలో దాదాపు 30వేల మందిపై జరిపిన ప్రయోగాల్లో ఈ ఫలితాలు వెల్లడైనట్లు నొవావాక్స్‌ ప్రకటించింది. అయితే, ఈ టీకా సెప్టెంబర్‌ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు పూనావాలా ఈ మధ్యే వెల్లడించారు.

వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు భారత్‌లోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో అమెరికా సంస్థ నొవావాక్స్‌ ఇదివరకే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ 110కోట్ల డోసులను తయారు చేయనున్నట్లు సమాచారం. అమెరికాలో అనుమతి పొందిన అనంతరం భారత్‌లోనూ వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి. ఇక ప్రస్తుతం భారత్‌లో మూడు వ్యాక్సిన్లు వినియోగంలో ఉన్నాయి. ఇక్కడ సెప్టెంబర్‌-అక్టోబర్‌ నాటికి చిన్నారులకు టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా తుది దశ ప్రయోగాలను చిన్నారులపై కొనసాగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని