Haryana: అధికారిపైనే కాదు.. రైతులపై చర్యలు తీసుకుంటాం: విజ్‌

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీఛార్జ్‌ చేసిన ఘటనపై హరియాణా హోం మంత్రి అనిల్‌ విజే చేసిన వ్యాఖ్యలు

Updated : 24 Sep 2022 16:32 IST

కర్నాల్‌: నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులపై లాఠీఛార్జ్‌ చేసిన ఘటనపై హరియాణా హోం మంత్రి అనిల్‌ విజ్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. ఓ వైపు లాఠీఛార్జ్‌కు కారణమైన ఐఏఎస్‌ అధికారి ఆయుష్‌ సిన్హాని సస్పెండ్‌ చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తుంటే.. మరోవైపు ఆయన రైతులను హెచ్చరించడం గమనార్హం. ‘‘కర్నాల్‌లో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోంది. దర్యాప్తు చేయకుండా ప్రభుత్వ అధికారులను శిక్షించలేము. ఒక్క ఆయుష్‌ సిన్హాపైనే కాదు. ఈ ఘటనలో రైతు నాయకులు దోషులుగా తేలితే వారిపైనా చర్యలు తీసుకుంటాం’’ అని హోంమంత్రి పేర్కొన్నారు.

కర్నాల్‌లో ఆగస్టు 28న రైతులపై పోలీసులు లాఠీఛార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పది మంది తీవ్రంగా గాయపడ్డారు. రైతుల తలలు పగలకొట్టండని పోలీసులను ఆదేశించిన అధికారిని సస్పెండ్‌ చేసి అతనిపై కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేస్తోంది. ‘ఓ హంతకుడ్ని రక్షిస్తూ.. ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. అతడ్ని బదిలీ చేయడం శిక్షించినట్లు ఎలా అవుతుంది?’ అని విమర్శించింది.

కాగా.. ‘కేంద్రం సాగు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లపై సింఘు, టిక్రి (దిల్లీ) సరిహద్దుల్లో నిరసనలు ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటాం’ అని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నాయకుడు రాకేష్ టికాయత్‌ అన్నారు. కర్నాల్‌లో నిరసన ఇప్పుడే ప్రారంభమైందని.. ఇది శాంతియుతంగా జరుగుతుందని స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ తెలిపారు. రైతుల డిమాండ్‌లను ప్రభుత్వం అంగీకరించేదాకా ఎక్కడికి వెళ్లేది లేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత గురనామ్‌ సింగ్‌ చాదునీ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని