ఏటీఎం కార్డుగా ఇస్మార్ట్‌ హస్తం!

ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగొస్తాం. తీరా ఇంటికొచ్చాక చూస్తే తాళంచెవి కనిపించదు. హడావుడిగా ఏటీఎం వద్దకు వెళతాం

Published : 10 Jul 2021 01:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగొస్తాం. తీరా ఇంటికొచ్చాక చూస్తే తాళంచెవి కనిపించదు. హడావుడిగా ఏటీఎం వద్దకు వెళతాం. కానీ, అక్కడకు వెళ్లాక చూస్తే జేబులో కార్డులు ఉండవు. ఇలాంటి అనుభవాలు అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఈ సమస్యలేవీ లేకుండా మన చెయ్యే తాళం చెవిగా, ఏటీఎం కార్డుగా, ఆఫీసులో ఐడీకార్డులాగా పని చేస్తే ఎంతో బాగుంటుంది కదా? రష్యాలోని వోల్చెక్ అనే ఓ వైద్యుడికి ఇదే ఆలోచన వచ్చింది. దాంతో అధునాతన టెక్నాలజీని 'చేతి'లో పెట్టుకుని తన పనులను సులభతరం చేసుకుంటున్నాడు.

రష్యాలోని నోవిసిబ్రిస్క్‌ నగరంలో ఓ ఆస్పత్రిలో ప్రసూతి వైద్యుడిగా పనిచేసే వోల్చెక్‌ శరీరంలో చిప్‌లను పెట్టుకున్నాడు. వాటి సాయంతో ఆఫీస్‌ తలుపులు తెరుస్తున్నాడు. అలాగే ఏటీఎంలో నగదు లావాదేవీలు జరుపుతున్నాడు. ఈ అధునాత సాంకేతికతను ఉపయోగించడం వల్ల రష్యా వ్యాప్తంగా వోల్చెక్‌ ఫేమస్‌ అయ్యాడు. ఆయన 2014లో తన శరీరంలో మొదటి చిప్‌ను అమర్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన శరీరంలో అయిదు చిప్‌లు ఉన్నాయి. కార్డ్‌లను వెంట తీసుకెళ్తే అవి పడిపోయే ప్రమాదం ఉండగా.. ఈ చిప్‌లను వాడితే అలాంటి సమస్య ఉండదని అంటున్నాడు వోల్చెక్‌. శరీరంలో చక్కెర స్థాయులు కొలిచేందుకు ఉపయోగించే గ్లూకో మీటర్‌ వంటి వైద్య పరికరాలను కూడా ఈ చిప్‌ల రూపంలో తీసుకువస్తే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నాడు. శరీరంలో చిప్‌లు పెట్టుకున్న వ్యక్తి ఈయన ఒక్కరే కాదు.. రష్యాలోని ఐటీ నిపుణులైన సెర్చి డోర్చిటో కూడా తన శరీరంలో ఇలాంటి చిప్‌లను అమర్చుకున్నారు. వీటి వల్ల ఎమ్మారై, సీటీ స్కాన్‌, ఎక్స్‌రే తీసుకునే సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవని వీరిద్దరూ చెబుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని