శీతలీకరించిన ఆహారపదార్థాల ప్యాకేజ్‌తోనూ వైరస్‌!

శీతలీకరించిన ఆహార పదార్థాల ప్యాకేజ్‌ కరోనా వైరస్‌తో కలుషితమైతే.. వాటి నుంచి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉందని తాజాగా చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) హెచ్చరించింది. నౌకల్లో దూర ప్రాంతాలకు తరలించే శీతలీకరించిన..........

Updated : 18 Oct 2020 12:42 IST

వెల్లడించిన చైనా సీడీసీ

బీజింగ్‌: శీతలీకరించిన ఆహార పదార్థాల ప్యాకేజ్‌ కరోనా వైరస్‌తో కలుషితమైతే.. వాటి నుంచి కూడా కొవిడ్‌‌ సోకే ప్రమాదం ఉందని తాజాగా చైనా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(సీడీసీ) హెచ్చరించింది. నౌకల్లో దూర ప్రాంతాలకు తరలించే శీతలీకరించిన ఆహారంతోనూ వైరస్‌ వ్యాపిస్తుందని తెలిపిన తొలి ప్రకటన ఇదే కావడం గమనార్హం.

ఖింగ్‌డావో నగరంలో ఉన్న నౌకాశ్రయంలోని శీతలీకరణ గిడ్డంగుల్లో పనిచేసే ఇద్దరు కార్మికులకు వైరస్‌ సోకినట్లు సెప్టెంబరులో గుర్తించారు. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారి నుంచి మరో 12 మందికి వైరస్‌ సంక్రమించింది. దీని మూలాల్ని పరిశీలించిన పరిశోధకులు ఆహార పదార్థాల ప్యాకేజింగ్‌పై వైరస్‌ ఆనవాళ్లను గుర్తించారు. అయితే, ఆ వైరస్‌ క్రియాశీలకంగా ఉంటేనే ఇతరులకు వ్యాపిస్తున్నట్లు సీడీసీ స్పష్టం చేసింది. కొన్ని ఆహార పదార్థాల్లో నిర్జీవంగా ఉన్న వైరస్‌ను కూడా గుర్తించినట్లు తెలిపారు. అటువంటి ఆహార పదార్థాలను పరీక్షించినప్పుడు పాజిటివ్‌ అని తేలినప్పటికీ.. వాటి నుంచి వైరస్‌ సోకే ప్రమాదం లేదని వెల్లడించింది. 

సీడీసీ ప్రకటనపై హాంకాంగ్‌ యూనివర్సిటీ వైరాలజీ ప్రొఫెసర్‌ జిన్‌ డోంగ్‌-యన్‌ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ ఇద్దరు కార్మికులకు ఆహార పదార్థాల ప్యాకేజ్‌ నుంచే వైరస్‌ సోకిందనడానికి సీడీసీ ఎలాంటి కచ్చితమైన ఆధారాలను చూపలేకపోయిందని తెలిపారు. వారే ఇతర ప్రాంతాల్లో వైరస్‌ ప్రభావానికి గురై.. దాన్ని ఆహార పదార్థాలకు అంటించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా శీతలీకరించిన ఆహార పదార్థాలతో కాంటాక్ట్‌లోకి వచ్చే సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీడీసీ గుర్తించింది వైరస్‌ జన్యు అవశేషాల్ని మాత్రమేనని ఆయన తెలిపారు. నిర్జీవంగా ఉండే వైరస్‌ సోకే ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని