వియత్నాంలో తొలి కరోనా మరణం

కరోనా కట్టడి చేయడంలో విజయంతమై ప్రపంచ దేశాల మన్ననలను పొందిన వియత్నాంలో 100 రోజుల తర్వాత కరోనా మళ్లీ విజృంభిస్తోంది.......

Published : 01 Aug 2020 01:50 IST

100 రోజుల తర్వాత కొత్త కేసులొస్తున్నాయ్‌..

హనోయ్‌: కరోనా కట్టడి చేయడంలో విజయంతమై ప్రపంచ దేశాల మన్ననలను పొందిన వియత్నాంలో 100 రోజుల తర్వాత కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటివరకు సున్నా మరణాలు కల్గిన ఈ కమ్యూనిస్టు దేశంలో శుక్రవారం తొలి కరోనా మరణం నమోదైంది. హుయీ‌ నగరంలో 70 ఏళ్ల వృద్ధుడు కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాకుండా ఒక్కరోజే దనాంగ్‌లో 45 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా వైరస్‌ సోకినవారి వయస్సు 27 నుంచి 87 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 509కి చేరింది. 

ప్రజలందరికీ సంక్షిప్త సందేశం!

దాదాపు 100 రోజుల తర్వాత దనాంగ్ నగరంలో కరోనా కలకలం రేపడంతో ప్రభుత్వం మరింతగా అప్రమత్తమైంది. వియత్నాం రాజధాని హనోయ్‌ నగరంలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేపడుతోంది. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా జులై మాసంలో దనాంగ్‌ నగరానికి వెళ్లిన ప్రతిఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకొనేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ దేశంలోని దాదాపు 9.5కోట్ల మందికి మొబైల్‌ ఫోన్లలో సంక్షిప్త సందేశాలను అధికారులు పంపారు.

తాజా పరిస్థితితో హనోయ్‌ నగరంలో బార్‌లు, నైట్‌ క్లబ్‌లను మూసివేశారు. భారీ సంఖ్యలో జనం గుమిగూడటంపై నిషేధం విధించారు. మరోవైపు, కొత్తగా నమోదైన కేసులతో పరిస్థితి చేజారిపోకుండా 1000 మందికి పైగా వైద్య సిబ్బందిని రంగంలోకి దించారు. కరోనా వైరస్‌ పుట్టిన చైనా పక్కనే ఉన్నప్పటికీ వియత్నాం కరోనా కోరలకు చిక్కకుండా ఎంతో అప్రమత్తతతో వ్యవహరించింది. తద్వారా తమ దేశ ప్రజలను కాపాడుకొని ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయంగా నిలిచిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని