Published : 13/08/2020 09:39 IST

కరోనా కాలంలో ఇదీ ‘బడి’!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇది కరోనా కాలం.. ఈ వైరస్‌ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. విద్యా రంగానికి కొవిడ్‌ కొత్త పరీక్ష పెట్టింది. పరీక్షలు, కౌన్సెలింగ్‌లు, ప్రవేశాలతో హడావుడిగా సాగాల్సిన విలువైన సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మాస్క్‌లు, శానిటైజర్లు వైపు పరుగులు పెట్టేలా చేసింది. తమ పిల్లల చదువులు ఏమైపోతాయో అనే ఆందోళనను మిగిల్చింది. విద్యా ప్రణాళికతో పాటు బడులు స్వరూపాన్నే మార్చేసింది. ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌ ప్రభుత్వం తమ దేశంలోని పాఠశాలలను జులైలోనే ప్రారంభించింది. పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు పాటిస్తూ కొత్త సాధారణ పరిస్థితులను తీసుకొచ్చింది. ఇప్పటికైతే భౌతికదూరమే ఉత్తమ వ్యాక్సిన్‌ అని నిపుణులు హెచ్చరిస్తున్న బ్యాంకాక్‌ పాఠశాలల్లో తీసుకుంటున్న చర్యలేంటో చూద్దామా?     

ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. అంతా కలిసి ఒకేచోట కలిసిమెలిసి ఆడుకోవాలనుకుంటారు. కానీ, కరోనా భయం వెంటాడటంతో బ్యాంకాక్‌లోని ద వాట్‌ ఖ్లోంగ్‌ టాయ్‌ పాఠశాలలో భౌతికదూరం పాటించేలా పిల్లల కోసం ప్రత్యేక బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దీంతో కేజీ చిన్నారులు మాస్క్‌లు కట్టుకొని ఎవరికి కేటాయించిన బాక్స్‌లో వారే బొమ్మలతో ఆడుకొంటున్నారిలా.. 

ఆటలాడే సమయంలో పిల్లలు ఒకచోట నిలవరు. ముసిముసి నవ్వులతో అటూఇటూ పరుగులు తీస్తారు. అలాంటి చిన్నారులకు ఒక గీత గీసి అందులోనే కదలకుండా ఉండాలంటే కష్టమే. పాఠశాలల్లో భౌతికదూరం నిబంధనలు విధించిన వేళ వారికి ఈ కష్టాలు తప్పడంలేదు. మార్చి నెల మధ్యలోనే థాయ్‌లాండ్‌లో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో అకస్మాత్తుగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తర్వాత బ్యాంకాక్‌లోని ఈ పాఠశాల జులైలో ప్రారంభమైంది. చిన్నారులకు కొవిడ్‌ ముప్పు పొంచి ఉన్నందున పాఠశాలలను సురక్షిత వాతావరణంలో కొనసాగించేందుకు యాజమాన్యం, ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

 

చిట్టిపొట్టి చిన్నారులు ఉపయోగించిన చోట పరిశుభ్రత తక్కువగా ఉండటం సాధారణమే. అలాంటప్పుడు కరోనా సమయంలో ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం పాఠశాల యాజమాన్యాలకు పెద్ద సవాలే. కానీ, చిన్నారులు వాడిన షింక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రతి తరగతి గది బయట సబ్బులు, చేతుల్ని శుభ్రపరుచుకొనే షింక్‌లను ఏర్పాటు చేశారు. తరగతి గదితో పాటు భోజనం చేసే ప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా ప్లాస్టిక్‌ కవర్లతో బాక్స్‌ల్లా రూపొందించారు. అలాగే, హ్యాండ్‌ శానిటైజర్లు, ఉష్ణోగ్రతలు తెలిపే స్కానర్లను ఎక్కడికక్కడ ఉంచారు. దాదాపు నెల నుంచి ఈ పాఠశాల తెరిచి ఉన్నప్పటికీ అక్కడ ఒక్క కొవిడ్‌ కేసూ నమోదు కాకపోవడం విశేషం.

దేశ వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించాలనే ఉద్దేశంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను కొంతవరకు సడలించినప్పటికీ  ద వాట్‌ ఖ్లోంగ్‌ టాయ్‌ పాఠశాల మాత్రం భౌతికదూరం నిబంధనలను కఠినంగా అమలుచేయాలని నిర్ణయించుకుంది.


ఆగ్నేయ ఆసియా దేశమైన థాయ్‌లాండ్‌ జనాభా దాదాపుగా ఏడు కోట్లు. అక్కడ కరోనా మరణాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటివరకు థాయ్‌లాండ్‌లో 3356 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. వారిలో 3169మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ వైరస్‌ బారిన పడి కేవలం 58మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని