పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి: ఆర్మీ చీఫ్‌

భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌..

Published : 04 Sep 2020 13:19 IST

దేనికైనా సిద్ధంగా ఉన్నామని వెల్లడి

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నట్లు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణె పేర్కొన్నారు. దేశ భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బలగాలను మోహరించామని తెలిపారు. ఈశాన్య లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు సమీపంలో చైనా దురాక్రమణకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ గురువారం నుంచి ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు. చైనా దుశ్చర్యను తిప్పికొట్టేందుకు భారత జవాన్లు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. డ్రాగన్‌తో చర్చలు చేపట్టి సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. ‘లద్దాఖ్‌ చేరుకున్నాక సరిహద్దుల్లోని పరిస్థితులపై ఆరా తీశాను. భారత ఆర్మీ ప్రపంచంలోనే ఉత్తమమైనది. దేశం గర్వించేలా వారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. వాస్తవాధీనరేఖ వెంట పరిస్థితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నట్లు, వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

‘గత రెండు, మూడు నెలల నుంచి పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. సైనిక, దౌత్య మార్గాల్లో చైనాతో నిరంతరం చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలతో సరిహద్దుల్లోని సమస్యలు తొలగిపోతాయని నమ్ముతున్నాం’ అని పేర్కొన్నారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై గత వారం రోజులుగా భారత్‌-చైనా సైనికాధికారుల మధ్య జరుగుతున్న చర్చలు నేడు ఐదో రౌండ్‌కు చేరుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని