Updated : 12/08/2020 13:28 IST

రష్యా వ్యాక్సిన్‌: డేటాపై విమర్శలు

రష్యాది నిర్లక్ష్య ధోరణే అంటున్న అంతర్జాతీయ నిపుణులు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పలుకంపెనీలు భారీస్థాయిలో పరిశోధనలు చేపట్టాయి. ఇప్పటికే తొలి, రెండో దశల క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తిచేసుకొని వేలమందిపై చేపట్టే మూడో దశకు చేరుకున్నాయి. కానీ, రష్యా మాత్రం వ్యాక్సిన్‌ ప్రయోగాలపై ఎలాంటి సమాచారం ప్రపంచానికి తెలపకుండానే టీకాను అభివృద్ధి చేసినట్లు ప్రకటించడం నిర్లక్ష్య ధోరణేనని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా బ్రిటన్‌ శాస్త్రవేత్తలు మాత్రం రష్యా టీకాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. అత్యంతవేగంగా చేసే ప్రయోగాల వల్ల ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చని బ్రిటన్‌లోని వార్‌విక్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకురాలు ఐఫర్‌ ఆలీ హెచ్చరించారు.

లండన్‌ జెనెటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన యూనివర్సిటీ కాలేజ్‌ నిపుణులు కూడా పుతిన్‌ ప్రకటనను తప్పుపట్టారు. ఇది నిజంగా నిర్లక్ష్యం, మూర్ఖంగా వ్యవహరించడమే అని విశ్వవిద్యాలయ నిపుణులు ఫ్రాన్‌కోయిస్‌ బాలౌక్స్‌ స్పష్టం చేశారు. అసంపూర్తిగా పరీక్షించిన వ్యాక్సిన్‌ను భారీస్థాయిలో ప్రజలకు అందించడం అనైతికమన్నారు. దీనివల్ల ఏర్పడే పర్యవసానాలు ప్రజారోగ్యంపై ప్రభావం చూపడంతోపాటు రానున్నరోజుల్లో వ్యాక్సిన్‌పై ప్రజల్లో వ్యతిరేకభావన ఏర్పడే అవకాశం ఉందని బాలౌక్స్‌ అభిప్రాయపడ్డారు. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీకి చెందిన ఇమ్యూనాలజీ నిపుణులు కూడా ఇదేవిధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేవలం బ్రిటన్‌ నిపుణులే కాకుండా రష్యా వ్యాక్సిన్‌పై జర్మనీ పరిశోధకులు కూడా అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. వ్యాక్సిన్‌ ఆమోదం పొందేముందు వేలమందిపై దాన్ని పరీక్షించాల్సి ఉంటుంది. కానీ, రష్యా మాత్రం వ్యాక్సిన్‌కు అత్యంత తొందరగా ఆమోదం తెలపడం నిర్లక్ష్యమేనని జర్మనీకి చెందిన పీటర్‌ క్రెమ్స్‌నెర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే, వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే మోడెర్నా, ఫైజర్‌, ఆస్ట్రాజెనికా వంటి పరిశోధన సంస్థలు వాటి వ్యాక్సిన్‌లను వేలమందిపై ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. పరిశోధనా సమాచారాన్ని ఎప్పటికప్పుడు నియంత్రణ సంస్థలకు అందిస్తున్నాయి. కానీ రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌పై సరైన సమాచారం లేదని నిపుణులు వాదిస్తున్నారు. వ్యాక్సిన్‌లు ఎలా తయారు చేశారు? వాటి రోగనిరోధక సామర్థ్యాలు, కొవిడ్‌ను ఎదుర్కొంటున్నట్లు రుజువులు, వ్యాక్సిన్‌ సురక్షితం అనడానికి కావాల్సిన సమాచారాన్ని ఎక్కడా ప్రచురించకపోవడాన్ని అంతర్జాతీయంగా నిపుణులు ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో అంటువ్యాధుల నిపుణుడైన ఆంటోనీ ఫౌచీ కూడా ఇదే విషయాన్ని ఇటీవల ప్రస్తావించారు. వ్యాక్సిన్‌ కోసం రష్యా, చైనా పరిశోధకులు సరైన ప్రయోగాలు నిర్వహిస్తున్నారని ఆశిస్తున్నామన్నారు. ప్రయోగాలు చేపట్టకుండానే వ్యాక్సిన్‌ పంపిణీ కోసం సిద్ధంచేయడం సమస్యలకు దారితీస్తుందని ఆంటోనీ ఫౌచీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, టీకాను విడుదల చేయడానికి ముందు అన్ని దశల్లో దాన్ని పూర్తిస్థాయిలో పరీక్షించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రపంచదేశాలను ఇప్పటికే కోరింది.

ఇవీ చదవండి..
వ్యాక్సిన్‌ సిద్ధం
రష్యా వ్యాక్సిన్‌కు 20దేశాల ఆర్డర్లు!

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్