రెండోసారి కరోనా..ఆందోళనకరమే!

రెండోసారి కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 23 Sep 2020 14:30 IST

ముంబయి: రెండోసారి కరోనా బారిన పడిన వారిలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. నలుగురు వ్యక్తుల జీనోమ్ సీక్వెన్సింగ్‌ను అధ్యయనం చేసిన మీదట వారు ఈ నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి ప్రిప్రింట్ వెల్లడించిన వివరాలు ది లాన్సెట్‌ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.  

బీఎంసీ ఆధ్వర్యంలో నడుస్తోన్న నాయర్‌ ఆసుపత్రిలోని ముగ్గురు వైద్యులు, హిందుజా ఆసుపత్రికి చెందిన ఒక ఆరోగ్య కార్యకర్తకు రెండోసారి కరోనా వైరస్‌ సోకింది. ఈ రెండు ఆసుపత్రులతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్‌ అండ్ ఇంటిగ్రేటివ్ బయోలజీ, దిల్లీకి చెందిన ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనిటిక్స్ ఇంజనీరింగ్ అండ్ బయోలజీ వారి జీనోమ్స్‌పై అధ్యయనం నిర్వహించాయి. నలుగురు నుంచి రెండు సార్లుగా ఎనిమిది నమూనాలను తీసుకొని  పరిశీలించగా..వారి వైరస్‌ జీనోమ్స్‌లో 39 సార్లు ఉత్పరివర్తనలు చోటుచేసుకున్నట్లు గమనించారు.

‘వారిలో రెండో సారి లక్షణాలు ఎక్కువగా కనిపించాయి. మొదటి సారితో పోల్చుకుంటే ఎక్కువ రోజులు అనారోగ్యంతో ఉన్నారు. కొవిడ్‌పై ముందుండి పోరాటం చేస్తోన్న వైద్యసిబ్బంది మరోసారి వైరస్‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్‌టీపీసీఆర్ పరీక్ష రీఇన్ఫెక్షన్‌ను నిర్ధారించదు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా మాత్రమే ఈ విషయం వెల్లడవుతుంది’ అని పరిశోధకులు వెల్లడించారు. మొదటి సారి లక్షణాలు లేని, స్వల్ప స్థాయిలో ఉన్నవారు రెండోసారి మాత్రం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే వయసు తక్కువ కావడంతో శ్వాస సంబంధ సమస్యలు తలెత్తి ఉండకపోవచ్చని అభిప్రాయడ్డారు. సుమారు నెల రోజుల క్రితం తొలి రీఇన్ఫెక్షన్ కేసు హాంకాంగ్‌లో వెలుగుచూసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని