దిల్లీలో కరోనా: రంగంలోకి కేంద్రం!

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ను వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా పారామిలిటరీ బలగాలకు చెందిన 45 మంది వైద్యులు, 160 మంది పారామెడికల్ సిబ్బంది ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. కొవిడ్‌ కేర్ కమ్ ఐసోలేషన్ సౌలభ్యాన్ని అందించేందుకు ...........

Published : 18 Nov 2020 16:38 IST

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ను వ్యాప్తిని అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలతో కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా పారామిలిటరీ బలగాలకు చెందిన 45 మంది వైద్యులు, 160 మంది పారామెడికల్ సిబ్బంది ఇప్పటికే దిల్లీకి చేరుకున్నారు. కొవిడ్‌ కేర్ కమ్ ఐసోలేషన్ సౌలభ్యాన్ని అందించేందుకు 800 పడకలతో రైల్వేశాఖ ప్రత్యేక కోచ్‌లను సిద్ధం చేస్తోంది. ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా ఈచర్యలు తీసుకుంటున్నట్టు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 

అక్టోబర్ నుంచి దిల్లీలో కరోనా వైరస్‌ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకానొక దశలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,000 మార్కును కూడా దాటి అక్కడి ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దాంతో దిల్లీలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారంటూ ఊహాగానాలు వచ్చినప్పటికీ.. అలాంటిదేమీ ఉద్దేశమేమీ  తమ ప్రభుత్వానికి లేదని దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా స్పష్టంచేశారు. కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయడంతో పాటు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే కేంద్రం రంగంలోకి దిగడంతో పారామిలిటరీ బలగాలకు చెందిన 45 మంది వైద్యులు, 160 మంది పారామెడికల్ సిబ్బందిని డీఆర్‌డీఓ, ఛాతర్‌పూర్‌లోని కోవిడ్ కేర్‌ సెంటర్‌లో విధులు నిర్వర్తించేందుకు నియమించినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో మిగిలిన వైద్య సిబ్బంది దిల్లీకి చేరుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నగరంలోని 100 ప్రైవేటు ఆసుపత్రుల్లో పడకల వినియోగం, పరీక్షా సామర్థ్యం, అదనంగా ఉన్న ఐసీయూ పడకల సంఖ్యపై ఒక అంచనాకు వచ్చేందుకు హోంశాఖ నియమించిన 10 బృందాలు పర్యటిస్తున్నాయన్నారు. అంతేకాకుండా షకూర్ బస్తీ రైల్వే స్టేషన్‌లో 800 పడకలతో కూడిన కోచ్‌లను అందుబాటులో ఉంచనున్నారు. నవంబర్‌ నెల చివరినాటికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల సామర్థ్యాన్ని 60వేలకు పెంచేందుకు దిల్లీ ప్రభుత్వం, ఐసీఎంఆర్‌ కలిసి పనిచేస్తున్నాయని హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇంటింటి సర్వే ప్రారంభం కానుందని, బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి 250 వెంటిలేటర్లు దిల్లీకి చేరుకోనున్నాయని వెల్లడించారు. 10 మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని