స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా నిమిషాల్లో కొవిడ్‌ ఫలితం!

స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా కేవలం అరగంట వ్యవధిలోనే కొవిడ్‌ నిర్ధారణ ఫలితాన్నిచ్చే నూతన సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు

Published : 08 Dec 2020 02:16 IST

అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో వీలైనంత తొందరగా వ్యాధికారక వైరస్‌ను గుర్తించడమే ఎంతో కీలకం. ఇప్పటివరకు వైరస్‌ నిర్ధారణ కోసం ఆర్‌టీ-పీసీఆర్‌తో పాటు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులను వాడుతున్నారు. అయితే, తాజాగా స్మార్ట్‌ఫోన్‌ ఆధారంగా కేవలం అరగంట వ్యవధిలోనే కొవిడ్‌ నిర్ధారణ ఫలితాన్నిచ్చే నూతన సాంకేతికతను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటికి సంబంధించిన పరిశోధనా నివేదిక సెల్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

నూతన విధానంలో, క్యాస్‌13 ప్రోటీన్‌ను రిపోర్టర్‌ మాలిక్యూల్‌తో ముందుగానే కలిపి ఉంచి.. దీన్ని వ్యక్తి నుంచి (శ్వాబ్‌ ద్వారా) సేకరించిన కొవిడ్‌ శాంపిల్‌తో జతచేస్తారు. ఈ శాంపిల్‌ ఉన్న పరికరాన్ని స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించినప్పుడు అది కరోనావైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను గుర్తిస్తుంది. అయితే, ఆ సమయంలో స్మార్ట్‌ఫోన్‌ కెమెరా మైక్రోస్కోప్‌గా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అందుబాటులోకి తెచ్చేలా.. ఈ పరీక్షను వివిధ రకాల మొబైల్‌ ఫోన్లకు అనుగుణంగా మార్చవచ్చని పరిశోధకులు తెలిపారు.

ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సాంకేతికత ప్రకారం, సేకరించిన నమూనాలోని వైరల్‌ ఆర్‌ఎన్‌ఏను డీఎన్‌ఏగా మార్చిన అనంతరం విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో సమయం ఎక్కువ తీసుకోవడంతో పాటు ఇది కాస్త క్లిష్టమైన పని. ప్రస్తుతం అభివృద్ధి చేసిన నూతన విధానంలో ఇలాంటి సమస్యలేవీ ఉండవని.. CRISPR నుంచి నేరుగా వైరల్‌ లోడ్‌ను గుర్తించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ వంటి పరీక్ష అవసరమైన సందర్భాల్లో ఈ నూతన సాంకేతికత ఎంతో దోహదపడుతుందని అమెరికాలోని గ్లాడ్‌స్టోన్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకుడు జెన్నీఫర్‌ డౌడ్నా వెల్లడించారు. తద్వారా వేగంగా, కచ్చితమైన ఫలితం పొందడం సాధ్యమవుతుందని స్పష్టంచేశారు. అంతేకాకుండా, ఈ విధానంలో కరోనా వైరస్‌ పాజిటివ్‌‌ లేదా నెగటివ్‌ అని నిర్ధారించడంతో పాటు వైరల్‌ లోడ్‌ను కూడా అంచనా వేస్తుందని పేర్కొన్నారు.

పరిశోధనల్లో భాగంగా, వ్యక్తుల నుంచి సేకరించిన శాంపిళ్లను పరిశోధకులు వారి మొబైల్‌ ఫోన్లతో పరీక్షించి చూశారు. ఇలా అతి తక్కువ సమయంలోనే ఫలితంతో పాటు వైరల్‌లోడ్‌ ఎంతవుందనే విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా, కేవలం ఐదు నిమిషాల్లోనే కచ్చితమైన ఫలితాన్ని ఇవ్వగా.. వైరల్‌ లోడ్‌ తక్కువగా ఉన్న శాంపిళ్లలో మాత్రం నెగటివ్‌ ఫలితం ఇచ్చేందుకు ఈ పరికరం 30నిమిషాల సమయం తీసుకుంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఈ నూతన సాంకేతికతను అభివృద్ధి చేసిన జెన్నీఫర్‌ డౌడ్నా, 2020లో రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి పొందినవారిలో ఒకరు కావడం విశేషం.

ఇవీ చదవండి..
కారులో కొవిడ్‌ రిస్క్‌ తప్పించుకోవాలంటే?
బయటికెళ్తే మాస్క్‌ తప్పనిసరి: సీడీసీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని