చైనాకు 40 దేశాల చురకలు!

కొవిడ్‌ నేపథ్యంలో ప్రపంచదేశాల విశ్వాసాన్ని కోల్పోయిన చైనా.. తాజాగా మానవహక్కుల విధానాలపైనా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అమెరికా సహా 40 కీలక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు చైనా మానవహక్కుల విధానాలపై పెదవి విరిచాయి..........

Published : 07 Oct 2020 09:39 IST

న్యూయార్క్‌: కొవిడ్‌ నేపథ్యంలో ప్రపంచదేశాల విశ్వాసాన్ని కోల్పోయిన చైనా.. తాజాగా మానవహక్కుల విధానాలపైనా అప్రతిష్ఠను మూటగట్టుకుంది. అమెరికా సహా 40 కీలక దేశాలు, ముఖ్యంగా పశ్చిమ దేశాలు చైనా మానవహక్కుల విధానాలపై పెదవి విరిచాయి. షింజియాంగ్‌ ప్రావిన్సు సహా టిబెట్‌ మైనారిటీలపై జరుపుతున్న అకృత్యాలను ఐరాస వేదికగా ఎండగట్టాయి. షింజియాంగ్‌లో వీగర్‌ ముస్లింల నిర్బంధాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకునేందుకు వెంటనే అంతర్జాతీయ నిపుణుల్ని అనమతించాలని డిమాండ్‌ చేశాయి. హాంకాంగ్‌ విషయంలోనూ చైనా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికాయి. అమెరికా, జపాన్‌, జర్మనీ సహా 39 ప్రముఖ దేశాలకు చెందిన ఈ ప్రకటనను జర్మనీ రాయబారి ఐరాస వేదికపై చదివి వినిపించారు. చైనా ఈ ప్రకటనను ఖండించింది.  

ఇక్కడా పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని చాటుకుంది. ఓ ఇస్లాం దేశంగా వీగర్‌ ముస్లింల పట్ల జరుగుతున్న అకృత్యాలను అడ్డుకోవాల్సింది పోయి చైనాకు వంత పాడింది. హాంకాంగ్‌ సహా ఇతర అంశాలు చైనా అంతర్గత విషయాలంటూ చేతులు దులిపేసుకుంది. క్యూబా సహా మరికొన్ని దేశాలు సైతం చైనాకు మద్దతుగా నిలిచి తమ అవగాహనారాహిత్యాన్ని చాటుకున్నాయి. 

షింజియాంగ్‌లో అనేక మంది వీగర్‌ ముస్లింలను నిర్బంధ కేంద్రాల్లో ఉంచి వారిచేత వెట్టిచాకిరి చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటికే పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఆధారాల్ని సంపాదించాయి. నిర్బంధ చాకిరితో పాటు బలవంతంగా వారికి కుటుంబ నియంత్రణ చేయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇప్పటికే అంతర్జాతీయంగా చైనాపై వ్యతిరేక భావనలు ఎక్కువయ్యాయని ఓ సర్వేలో తేలింది. ముఖ్యంగా కరోనా సమయంలో ఆ దేశం ప్రవర్తించిన తీరు చాలా మందిలో అనుమానాలకు కారణమైందని వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని