రుచి, వాసనలే కచ్చితమైన సూచికలు..!

వాసన, రుచి కోల్పోయే లక్షణాలే కరోనా వైరస్‌ను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని తాజా పరిశోధనలు స్పష్టంచేస్తున్నాయి.

Updated : 12 Aug 2022 15:24 IST

లండన్‌ పరిశోధకుల వెల్లడి

లండన్‌: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను గుర్తించడంలో వ్యాధి లక్షణాలు ఎంతో కీలకం. ఇప్పటివరకు జ్వరం, దగ్గు వంటి వాటిని ముఖ్య లక్షణాలుగానే పరిగణిస్తున్నారు. అయితే, వీటికంటే వాసన, రుచి కోల్పోయే లక్షణాలే వైరస్‌ను గుర్తించడంలో కీలకంగా ఉన్నాయని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. యూనివర్సిటీ కాలేజీ లండన్‌(UCL)కు చెందిన నిపుణులు తొలిసారిగా వీటిపై పరిశోధన చేశారు.

లండన్‌లో వైరస్ విజృంభిస్తోన్న ఏప్రిల్‌-మే మధ్యకాలంలో కొవిడ్‌ లక్షణాలపై ఈ తరహా పరిశోధన చేపట్టారు. ఇందులో భాగంగా రుచి, వాసన కోల్పోతున్న వారు తమ పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా దాదాపు 590మందిని రిజిస్టర్‌ చేయించుకున్నారు. అనంతరం వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా వారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి యాంటీబాడీలు వృద్ధిచెందినట్లు గుర్తించారు. దీంతో వారందరికీ కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. ఇలా మొత్తం 78శాతం మందికి వైరస్‌ సోకినట్లు కనుగొన్నారు. 40శాతం మందికి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కూడా లేవని, కానీ, వారు రుచి, వాసనను గుర్తుపట్టలేక పోతున్నారని పేర్కొన్నారు. దీంతో రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు కరోనా వైరస్‌ను గుర్తించడంలో అత్యంత నమ్మకమైన సూచికలుగా నిర్ధారించారు. ప్రస్తుతం లండన్‌తోపాటు చాలా ప్రాంతాల్లో రెండో దఫా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో ఇలాంటి లక్షణాల ద్వారా వైరస్‌ సోకిన వారిని వీలైనంత త్వరగా గుర్తించవచ్చని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ రేచెల్‌ బాటర్‌హమ్‌ స్పష్టంచేశారు. అనంతరం వారికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు నియంత్రించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా ఇంటిలో ఉండే ఉల్లి, వెల్లుల్లి, కాఫీ, పెర్‌ఫ్యూమ్‌ వంటి వాసనలను పసిగట్టలేకపోతున్నట్లు గుర్తించిన వెంటనే కొవిడ్‌ టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం లండన్‌లో ఈ తరహా ప్రక్రియ కొనసాగుతోందని, కానీ, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో జ్వరం, శ్వాసకోశ లక్షణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఈ లక్షణాలను ప్రామాణికంగా తీసుకోవాలని లండన్‌ పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని