ధర్మేగౌడ ఆత్మహత్యపై దర్యాప్తు జరపాలి: ఓంబిర్లా

కర్ణాటక విధాన పరిషత్‌ డిప్యూటీ ఛైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు జిల్లా గుణసాగర

Published : 30 Dec 2020 21:55 IST

దిల్లీ: కర్ణాటక విధాన పరిషత్‌ డిప్యూటీ ఛైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభిప్రాయం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు జిల్లా గుణసాగర రైల్వే పట్టాల వద్ద ధర్మేగౌడ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ట్విటర్‌ వేదికగా స్పందించిన ఓం బిర్లా.. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనమండలిలో ఆయనకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించారు. 

‘ధర్మేగౌడ మృతి బాధాకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. మండలిలో ఆయన ఛైర్మన్‌గా వ్యవహరించినప్పుడు జరిగిన దురదృష్టకర ఘటన.. ప్రజాస్వామ్యంపై దాడి లాంటిది. ఆయన మృతిపై స్వతంత్ర సంస్థతో ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని లోక్‌సభ స్పీకర్‌ ట్వీట్‌ చేశారు. చట్టసభల హుందాతనం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు. 

ఈ నెల 15న కర్ణాటక శాసనమండలిలో సభాపతి ప్రతాప్‌ చంద్రశెట్టిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే సందర్భంగా వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మండలి ఛైర్మన్‌ రాకముందు ఆయన స్థానంలో డిప్యూటీ ఛైర్మన్‌ హోదాలో ధర్మేగౌడ కూర్చోగా కాంగ్రెస్‌ సభ్యులు ఆయనను లాగిపడేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే సోమవారం అర్ధరాత్రి ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది. 

ఇదీ చదవండి.. 

కర్ణాటక మండలి డిప్యూటీ ఛైర్మన్‌ ధర్మేగౌడ ఆత్మహత్య

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని