ట్రంప్‌ రెచ్చిపోతారేమో.. జాగ్రత్తగా ఉండండి!

నాలుగేళ్ల పాలనలో ఇరాన్‌పై కత్తిగట్టి కఠిన ఆంక్షలు విధించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటీవల ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో అధికార పీఠాన్ని వీడే చివరి రోజుల్లో ట్రంప్‌ నుంచి

Updated : 21 Nov 2020 11:12 IST

మిత్రదేశాలను హెచ్చరించిన ఇరాన్‌

బాగ్దాద్‌: నాలుగేళ్ల పాలనలో ఇరాన్‌పై కత్తిగట్టి కఠిన ఆంక్షలు విధించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇటీవల ఆ దేశంపై దాడికి కూడా సిద్ధమై చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. దీంతో అధికార పీఠాన్ని వీడే చివరి రోజుల్లో ట్రంప్‌ నుంచి ముప్పు తప్పదని భావించిన ఇరాన్‌ అప్రమత్తమైంది. జాగ్రత్తగా ఉండండంటూ తన మిత్రదేశాలను కూడా హెచ్చరించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని, అలా చేస్తే ట్రంప్‌ రెచ్చిపోయే ప్రమాదముందని మధ్యప్రాచ్యంలోని ఇరాన్‌ మిత్రదేశాలకు సూచించింది. 

ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్య ఆంక్షలు కూడా విధించారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్‌ అత్యున్నత స్థాయి కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై దాడి చేయించి ఆయన మరణానికి కారణమయ్యారు. అమెరికా చర్యకు ఇరాన్‌ కూడా దీటుగా బదులచ్చింది. ఇరాక్‌లో యూఎస్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిపింది. అలా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి.

అయితే ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై బైడెన్‌ విజయం సాధించడంతో మళ్లీ రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఇరాన్‌ భావించింది. బైడెన్‌ పాలనలో మళ్లీ అణు ఒప్పందం చేసుకోవాలని అనుకుంది. ఇరాన్‌ మిత్ర దేశాలు కూడా ట్రంప్‌ ఓటమిని స్వాగతించాయి. అయితే ఎన్నికల్లో ఓటమిని ఇంకా అంగీకరించిన ట్రంప్‌ ఇటీవల కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇరాన్‌పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాల గురించి అధికారులను ఆరా తీశారు. అయితే దాని వల్ల పొంచి ఉన్న ముప్పులను అధికారులు వివరించడంతో ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 

ఈ పరిణామాలతో అప్రమత్తమైన ఇరాన్‌.. తన మిత్రదేశాలకు హెచ్చరికలు పంపింది. అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే చివరి రోజుల్లో ట్రంప్‌ ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ప్రమాదముందని, అందుకే అమెరికాతో ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించింది. వచ్చే రెండు నెలలు ట్రంప్‌నకు అవకాశం ఇవ్వకుండా, ఉద్రిక్తతలకు తావివ్వకుండా కాస్త తగ్గి ఉండండని కోరినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్‌ అత్యున్నత స్థాయి జనరల్‌.. ఆ దేశ మిత్రపక్షాలకు సందేశం పంపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ట్రంప్‌ దాడి వార్తలపై స్పందించిన ఇరాన్‌ రక్షణ మంత్రి హొస్సేన్‌ డెఘాన్‌ కూడా ‘మేము యుద్ధాన్ని కోరుకోవట్లేదు’ అని మీడియాకు చెప్పారు. అయితే ట్రంప్‌ యంత్రాంగం దూకుడుగా ప్రవర్తిస్తే మాత్రం దీటైన జవాబు ఇస్తామని ఇరాన్‌ స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి..

ట్రంప్‌ మదిలో మెదిలిన ప్రమాదకర ఆలోచన

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని