బీరుట్‌లో భారీ పేలుళ్లు.. 78 మంది మృతి

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ మంగళవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల దాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా 4000 మందికి గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు అనంతరం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. సమీపంలోని...

Updated : 05 Aug 2020 09:55 IST

నాలుగువేల మందికి గాయాలు

బీరుట్‌: లెబనాన్‌ రాజధాని బీరుట్‌ మంగళవారం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పేలుళ్ల దాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోగా నాలుగువేల మందికి  గాయాలయ్యాయి. భవన శిథిలాల కింద అనేకమంది చిక్కుకున్నట్లు సమాచారం. పేలుడు అనంతరం సుడులు సుడులుగా దట్టమైన పొగ ఎగిసిపడింది. సమీపంలోని భవంతికీ మంటలు విస్తరించడంతో తీవ్రత మరింత పెరిగింది. అనేక భవంతుల్లో కిటికీలు, ఇళ్లలో అలంకరణ కోసం ఏర్పాటు చేసుకున్న పైకప్పులు తునాతునకలైపోయాయి. ఎక్కడ చూసినా భవనాల శిథిలాలు, దెబ్బతిన్న వాహనాల భాగాలు కనిపిస్తున్నాయి. బీరుట్‌ ఓడరేవు కేంద్రంగా చోటు చేసుకున్న ఈ ఘటన.. కొన్ని కిలోమీటర్ల దూరంలోని భవనాలపైనా ప్రభావం చూపింది. పెద్దఎత్తున ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

బీరుట్‌ ఓడరేవులో టపాసులు నిల్వ చేసిన గిడ్డంగిలో పేలుడు సంభవించినట్లు స్థానిక ప్రసార మాధ్యమాలు తెలిపాయి. పేలుడుకు కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు. అంతర్యుద్ధం, ఆత్మాహుతి దాడులు బీరుట్‌కు కొత్త కాకపోయినా తాజా ఘటన మాత్రం ప్రజల్ని నిర్ఘాంతపోయేలా చేసింది. అణుబాంబు పేలినట్లుగా అనిపించిందని స్థానిక ఉపాధ్యాయుడొకరు చెప్పారు. తొలుత టపాసులు పేలుతున్నట్లు మొదలైన శబ్దం ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లేలా వినిపించిందని పోర్టు కార్మికుడొకరు వివరించారు. బాధితులకు సాయం అందించేందుకు డజన్ల కొద్దీ అంబులెన్సులు రంగంలో దిగాయి. రక్తదానం చేయాల్సిందిగా ఆసుపత్రులు అభ్యర్థించాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని