రైతుల దీక్ష: అమిత్ షా-తోమర్‌ కీలక భేటీ

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు సోమవారం తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి

Published : 14 Dec 2020 13:01 IST

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు సోమవారం తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేశారు. ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో కీలకంగా భేటీ అయ్యారు. ఈ ఉదయం అమిత్ షా నివాసానికి వెళ్లిన తోమర్‌.. తాజా పరిస్థితులు, తదుపరి కార్యాచరణపై హోంమంత్రితో చర్చించారు. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబా, హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

సాయంత్రం రైతు సంఘాల భేటీ

మరోవైపు నిరాహారదీక్ష చేస్తున్న రైతు సంఘాల నాయకులు కూడా సోమవారం సాయంత్రం భేటీ కానున్నారు. సాయంత్రం 5  గంటలకు ఘాజీపూర్‌లో వ్యూహాత్మక చర్చలు జరపనున్నట్లు రైతు నేత ఒకరు తెలిపారు. దాని తర్వాత మంగళవారం ఉదయం 11 గంటలకు సింఘు సరిహద్దు వద్ద మరోసారి సమావేశం కానున్నట్లు చెప్పారు. రైతులందరితో చర్చించిన తర్వాత తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. 

దిల్లీ ఉపముఖ్యమంత్రి నిరశన దీక్ష

అన్నదాతలకు మద్దతుగా దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నిరశన దీక్ష చేపట్టారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యాలయంలో ఆప్‌ కార్యకర్తలతో కలిసి దీక్షకు కూర్చున్నారు. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా నిరాహార దీక్షలో పాల్గొననున్నట్లు తెలిపారు. 

దిల్లీ సరిహద్దుల మూసివేత

రైతుల దీక్ష నేపథ్యంలో సోమవారం దిల్లీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే అనేక సరిహద్దులను మూసివేసిన పోలీసులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఇవీ చదవండి..

రైతన్నల నిరాహార దీక్ష

గోయల్‌ దన్వె వ్యాఖ్యలపై రగడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని