యూకే రిటర్న్స్‌: వారందరినీ ట్రాక్‌ చేస్తాం..!

బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ సహాయంతో నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22వ తేదీ వరకు యూకే నుంచి భారత్‌ వచ్చిన వారందరి వివరాలను సేకరిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Published : 23 Dec 2020 02:21 IST

కేంద్ర ఆరోగ్యశాఖ

దిల్లీ: బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు మరోసారి వణికిపోతున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు బ్రిటన్‌ నుంచి విమాన సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ కూడా బ్రిటన్‌కు విమాన రాకపోకలపై తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. తాజాగా బ్రిటన్‌ నుంచి భారత్‌ వచ్చిన వారిలో కరోనా వైరస్‌ నిర్ధారణ అవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే, ఇప్పటివరకు బ్రిటన్‌లో బయటపడిన కొత్తరకం వైరస్‌ భారత్‌లో గుర్తించలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌ నుంచి గతకొద్దిరోజులుగా వివిధ రాష్ట్రాలకు భారీ సంఖ్యలో ప్రయాణికులు వచ్చినట్లు తెలుస్తోంది. బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్‌ సహాయంతో నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 22వ తేదీ వరకు యూకే నుంచి భారత్‌ వచ్చిన వారందరి వివరాలను సేకరిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. వారిలో ఎవరికైనా పాజిటివ్‌ వచ్చినట్లయితే వారి కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కూడా చేపడుతామని స్పష్టంచేశారు. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఆయా రాష్ట్రాలు నిమగ్నమయ్యాయి.

దిల్లీ.. గడిచిన రెండు వారాల్లోనే యూకే నుంచి దిల్లీ విమానాశ్రయానికి దాదాపు 6నుంచి 7వేల మంది వచ్చినట్లు దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర‌ జైన్‌ వెల్లడించారు. వారందరినీ ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైనట్లు పేర్కొన్నారు. యూకే నుంచి వచ్చిన వారందరినీ హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అయితే, నిన్న దిల్లీ విమానాశ్రయంలో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో యూకే నుంచి వచ్చిన ఐదుగురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

చెన్నై.. గత పది రోజుల్లో బ్రిటన్‌ నుంచి చెన్నైకి దాదాపు 1088 మంది ప్రయాణికులు వచ్చినట్లు తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది. వీరిందరినీ ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలిపింది. తాజాగా యూకే నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని.. ఆ వ్యక్తి శాంపిల్‌ను విశ్లేషిస్తామని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ వెల్లడించారు. ఇందుకోసం శాంపిల్‌ను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు ప్రకటించారు. యూకే నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారి ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ 14 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ముంబయి.. యూకే నుంచి భారత్‌ వచ్చిన ప్రయాణికుల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. యూకే నుంచి ముంబయికి మూడు విమానాల్లో ఈరోజు 591 మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వారిలో కరోనా లక్షణాలు లేవని తెలిపారు. వీరిలో 299మందిని వివిధి హోటళ్లలో క్వారంటైన్‌ చేయగా.. మరో 292 మందిని విమానాశ్రయంలోనే ఉంచారు. వీరిని ఏడు రోజుల పాటు వారి సొంత ఖర్చులతోనే తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉంచుతామని ముంబయి మునిసిపల్‌ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.

కోల్‌కతా.. సోమవారం రాత్రి యూకే నుంచి కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఇంటర్నేషనల్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిని సంస్థాగత క్వారంటైన్‌కు పంపారు. అయితే, గడిచిన 15రోజుల్లో యూకే నుంచి పశ్చిమ బెంగాల్‌ వచ్చిన వారి వివరాలను సేకరించడంతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో బెంగాల్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

బెంగళూరు.. కేంద్ర ప్రభుత్వ సూచనలతో అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ మధ్యకాలంలో బ్రిటన్‌ నుంచి బెంగళూరుకు వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో పడింది. కేవలం నిన్న ఒక్కరోజే రెండు విమానాల్లో దాదాపు 587 మంది ప్రయాణికులు బెంగళూరు చేరుకున్నట్లు అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం వీరిలో ఒకరిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప వెల్లడించారు. వారి కాంటాక్టు ట్రేసింగ్‌ చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌.. యూరప్‌లో కొత్తరకం వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ కూడా అప్రమత్తమైంది. గడిచిన వారంలో యూకే నుంచి హైదరాబాద్‌కు 358 మంది ప్రయాణికులు చేరుకున్నట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటివరకు ఏ ఒక్కరికీ వైరస్‌ నిర్ధారణ కాలేదు. అయితే, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం, నవంబర్‌ 25వ తేదీ నుంచి డిసెంబర్‌ 22వరకు విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షణలో ఉంచుతామని పేర్కొంది. ముఖ్యంగా యూకే నుంచి వచ్చిన వారు ప్రజారోగ్య శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించింది. హైదరాబాద్‌ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌-పీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేసింది. పాజిటివ్‌ వచ్చిన వారిని సంస్థాగత క్వారంటైన్‌కు తరలించనున్నారు. అంతేగాక, ఇప్పటికే యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. వీటితో పాటు మిగతా రాష్ట్రాలు కూడా యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్షలను చేయడంతో పాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ చేపట్టాయి.

ఇవీ చదవండి..
కరోనా కొత్తరకం..భారత్‌లో లేదు
ఇటలీలో మృత్యుఘోష..కారణాలు ఏంటంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని