అమెరికాలో కరోనా తొలి రీఇన్‌ఫెక్షన్‌ కేసు!

అమెరికాలో నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి రెండోసారి కరోనా వైరస్‌ సోకినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది. రెండోసారి మహమ్మారి బారినపడడంపై కలకలం కొనసాగుతున్న తరుణంలో..........

Updated : 29 Aug 2020 13:15 IST

రెండోసారీ తీవ్ర లక్షణాలు

వాషింగ్టన్‌: అమెరికాలో నెవాడా రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడికి రెండోసారి కరోనా వైరస్‌ సోకినట్లు ఓ అధ్యయనం పేర్కొంది. దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది. రెండోసారి మహమ్మారి బారినపడడంపై కలకలం కొనసాగుతున్న తరుణంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే హాంకాంగ్‌లో అధికారికంగా తొలి రీఇన్‌ఫెక్షన్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఐరోపాలోని పలు దేశాల్లోనూ రెండోసారి వైరస్‌ సోకినట్లు వార్తలు వినిపించాయి. కానీ, అవేవీ అధికారికంగా నమోదుకాలేదు.

హాంకాంగ్‌లో ఓ టెకీకి రెండోసారి వైరస్‌ సోకినప్పటికీ.. లక్షణాలు మాత్రం కనిపించలేదని అధికారులు తెలిపారు. దీంతో రెండోసారి సోకితే పెద్దగా ప్రమాదమేమీ ఉండదన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ, అందుకు భిన్నంగా తాజాగా అమెరికాలో నమోదైన కేసులో మొదటిసారి కంటే రెండోసారి తీవ్ర స్థాయిలో లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఏప్రిల్‌లో తొలిసారి వైరస్‌ బారినపడ్డ అతడు అదే నెల 27 నాటికి కోలుకున్నట్లు అధ్యయనంలో పేర్కొన్నారు. తర్వాత రెండుసార్లు చేసిన నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌ అని తేలింది.

ఒక నెల తర్వాత తిరిగి అనారోగ్యం బారిన పడడంతో వైద్యుల్ని సంప్రదించాడు. ఈసారి జ్వరం, తలనొప్పి, జలుబు, డయేరియా వంటి లక్షణాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. కృత్రిమంగా ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో మరోసారి కొవిడ్‌ పరీక్షలు చేయగా.. పాజిటివ్‌గా తేలింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ‘నెవాడా స్టేట్‌ పబ్లిక్‌ హెల్త్‌ లేబొరేటరీ’ పరిశోధకులు అధ్యయనం మొదలుపెట్టారు. రెండోసారి సోకిన వైరస్‌ జన్యుక్రమం తొలిసారి సోకిన దాని జన్యుక్రమం కంటే భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అంటే కరోనా వైరస్‌లోనే మరో రకం ఆ వ్యక్తికి సోకినట్లు అంచనాకు వచ్చారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ మహమ్మారి రూపాంతరం చెందుతుందని ఇప్పటికే పలు ప్రాథమిక అధ్యయనాలు తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకేవ్యక్తికి పలుసార్లు కొవిడ్‌-19 సోకే ప్రమాదం లేకపోలేదన్న అంచనాకు వచ్చారు. ఈ అధ్యయనాన్ని ఇంకా అధికారికంగా ప్రచురించాల్సి ఉంది.

ఇదీ చదవండి..

మళ్లీ సోకుతోంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని