దీపావళి బాణసంచాపై దిల్లీ నిషేధం

దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి టపాకాయలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. నగరంలో కరోనా పరిస్థితి............

Updated : 06 Nov 2020 12:42 IST

దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు

దిల్లీ: దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి టపాకాయలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. నగరంలో కరోనా పరిస్థితి, సన్నద్ధతపై ఉన్నతాధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి.. అనంతరం ఆ నిర్ణయాలను ట్విటర్‌లో వెల్లడించారు. పండుగ సీజన్‌ కావడం, కాలుష్యం పెరగడమే దిల్లీలో కరోనా వైరస్‌ విజృంభణకు కారణమన్నారు. నగరంలో వైద్య సదుపాయాలను మరింతగా మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌, ఐసీయూ పడకలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఐసీయూ పడకల పెంపునకు సంబంధించి తమ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై దిల్లీ హైకోర్టు స్టే ఇచ్చిందని, దీనిపై సుప్రీంకోర్టులో రేపు అప్పీల్‌కు వెళ్తామన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ స్టేను ఎత్తివేస్తుందని భావిస్తున్నామన్నారు. అలాగే, కరోనా పరీక్షలపై మరింత దృష్టి పెట్టాలని, కేసులు పెరుగుతున్నా మరణాల రేటు పెరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు, దీపావళి రోజున బెంగాల్‌లో బాణసంచా కాల్చడంపై కోల్‌కతా హైకోర్టు నిషేధం విధించింది. బాణసంచా విక్రయం, కాల్చడంపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ దీపావళి కలిసి జరుపుకొందాం.. రండి!

అంతకముందు మీడియా సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్‌..  ఈ ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ఎవరూ టపాకాయలు కాల్చొద్దని విజ్ఞప్తి చేశారు. తమ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈసారి లక్ష్మీపూజ నిర్వహిస్తామని, అందరం కలిసి దీపావళి జరుపుకొందామంటూ పిలుపునిచ్చారు. ఇందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. దీపావళి (నవంబర్‌ 14) రోజున రాత్రి 7.39 గంటలకు రెండు కోట్ల మంది దిల్లీ ప్రజలంతా తమ ఇళ్లల్లో టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమయ్యే లక్ష్మీ పూజ కార్యక్రమాన్ని వీక్షించాలని, తమ కుటుంబ సభ్యులతో కలిసి పూజల్లో పాల్గొనాలని కోరారు. 

టపాసులు కాల్చితే పిల్లలకు హానికరం!

గతేడాది టపాసులు కాల్చకుండానే దీపావళి జరుపుకొన్నామని, అదే విధంగా ఈసారి కూడా జరుపుకోవాలన్నారు. వాయు కాలుష్యం, కరోనా వైరస్‌ నేపథ్యంలో టపాసులు కాల్చడం పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తుందని హెచ్చరించారు. పొగ కారణంగా దిల్లీలో మరణాలు సంభవించడం ఇదే ఆఖరు ఏడాది కావాలని ఆకాంక్షించారు. దిల్లీ ప్రభుత్వం చేస్తున్నట్టుగానే అన్ని రాష్ట్రాలు తమ రైతులకు సాయం చేయాలని కోరారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్‌,  హరియాణాలలో రైతులు వరి దుబ్బులను తగుల బెట్టడం దిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి కారణమవుతోందని తెలిపారు. తాజాగా కరోనా కేసులు పెరగడానికి కూడా ఇదే ప్రధానకారణమన్నారు. దిల్లీలో నిన్న రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే 6842 కొత్త కేసులు, 51 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం నగరంలో 37369 యాక్టవ్‌ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 11.61%గా ఉన్నట్టు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని