కరోనా కొత్త రూపం.. టీకాకు ముప్పు!

కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి

Published : 07 Nov 2020 01:22 IST

మింక్‌’ల నుంచి మనుషులకు వ్యాప్తి

డెన్మార్క్‌లో అప్రమత్తం

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌లో కొత్త మార్పులు చోటు చేసుకొన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పులతో వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న టీకాలు పనిచేయవనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్‌లో మింక్‌ అనే జీవి నుంచి ఈ వైరస్‌ మనుషులకు వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ విషయాన్ని గుర్తించింది. దీంతో అప్రమత్తమైన డెన్మార్క్‌ ప్రభుత్వం దేశంలోని ఉత్తర జూట్‌ల్యాండ్‌ మున్సిపాలిటీల్లో  కొత్త ఆంక్షలను విధించింది. ఈ ప్రాంతంలో వందల కొద్ద ఫారమ్‌ల్లో మింక్‌లను పెంపకం చేపట్టారు.

ప్రధాని మెట్టీ ఫ్రెడ్రెక్సన్‌ ఉత్తర డెన్మార్క్‌లో అదనపు కొవిడ్‌ ఆంక్షలు ఏడో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. ఇవి దాదాపు 2,80,000 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపవచ్చు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌ టీకాలుకు ఈ రకం వైరస్‌ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ నివశించేవారు ప్రయాణాలు చేయవద్దని ప్రధాని పేర్కొన్నారు. దీనిని ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ ఉత్తర జూట్‌ల్యాండ్‌ వాసులు వ్యాధి వ్యాపించకుండా శతవిధాల కృషిచేయాలి. ప్రపంచం మనల్ని గమనిస్తోంది’’ అని ప్రధాని ఫెడ్రెక్సన్‌  పిలుపునిచ్చారు.

డెన్మార్మ్‌లో పరిస్థితేంటి?

ఇప్పటి వరకు స్థానిక పత్రికల కథనం ప్రకారం 207 మింక్‌  పెంపుడు కేంద్రాల్లో  కొత్త రకం కరోనావైరస్‌ను గుర్తించారు. వీటిని మొదట్లో గుర్తించడంలో అధికారులు విఫలం అయ్యారు.  ఈ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో దాదాపు 1.7కోట్ల మింక్‌లు వీటి బారిన పడే ప్రమాదం ఏర్పడింది.  తాజాగా ఐదు మింక్‌ పెంపుడు కేంద్రాల్లో 12 మందికి సోకినట్లు గుర్తించారు.  అదే జూన్‌ నుంచి చూస్తే 214 సోకినట్లు ది స్టేటెన్స్‌ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయం ఇప్పటికే ఆలస్యమైందని వైద్య నిపుణులు అంటున్నారు. దాదాపు ఐదున్నర నెలలుగా ఈ వ్యాధి ఆనుపానులు  కనిపించినా నిర్లక్ష్యం చేశారని హజ్రింగ్‌ మేయర్‌ డాక్టర్‌ ఆర్నె బోయెల్ట్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని