భారత్‌లో కరోనా విలయం: కోటికి చేరిన కేసులు!

గడిచిన తొమ్మిది నెలలుగా దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు బయటపడిన కేసుల సంఖ్య కోటికి చేరువయ్యింది.

Published : 18 Dec 2020 20:48 IST

దిల్లీ: గడిచిన తొమ్మిది నెలలుగా దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. అయితే, గతకొన్ని రోజులుగా వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ నిత్యం దాదాపు 20వేల పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. శుక్రవారం నాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటికి చేరువయ్యింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం, శుక్రవారం ఉదయానికి దేశంలో 99లక్షల 79వేల మందికి వైరస్‌ సోకగా వీరిలో 95లక్షల మంది ఇప్పటికే కోలుకున్నారు.  లక్షా 44వేల మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 95.40 శాతం ఉండగా, మరణాల రేటు 1.45శాతంగా ఉంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3లక్షలుగా(3.14శాతం) ఉంది.

అమెరికా తర్వాత భారత్‌లోనే..
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 7కోట్ల 50లక్షలు దాటినట్లు జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ నివేదించింది. వీటిలో అత్యధికంగా అమెరికాలోనే కోటి 72లక్షల మందికి వైరస్‌ సోకగా 3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రెండో దేశంగా భారత్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇక్కడ కొవిడ్‌ కేసుల సంఖ్య కోటికి చేరింది. 

మార్చి నెలలో తొలి కరోనా మరణం ..
దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30వ తేదీన నమోదైంది. మార్చి నెలలో లాక్‌డౌన్‌ విధించేనాటికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 600లకు చేరుకుంది. అప్పటికే 13 మంది మృత్యువాతపడ్డారు. తొలి కరోనా మరణం మాత్రం మార్చి 12వ తేదీన కర్ణాటకలో రికార్డయ్యింది. సౌదీ అరేబియా వెళ్లివచ్చిన కాలబుర్గికి చెందిన 76ఏళ్ల వృద్ధుడు కరోనా మహమ్మారి బారినపడి మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకున్న అనంతరం తన సొంతూరుకు వెళ్లిన తర్వాత ప్రాణాలు కోల్పోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు (గడిచిన తొమ్మిది నెలల కాలంలో) లక్షా 44వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిత్యం వందల సంఖ్యలో కరోనా మరణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

ప్రతి పదిలక్షల కేసులు..ఇలా..
దేశంలో జనవరి నెలలో తొలి కేసు నమోదైనప్పటికీ మార్చి వరకు కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. అనంతరం లాక్‌డౌన్‌ విధించడంతో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోగలిగారు. కానీ, అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైన నాటినుంచి భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఒక్కోసారి రోజువారీ కేసుల సంఖ్య లక్షకు చేరువైన రికార్డులూ ఉన్నాయి. కేవలం ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే 26లక్షల పాజిటివ్‌ కేసులు, 33వేల మరణాలు రికార్డయ్యాయి. అక్టోబర్‌లోనూ వైరస్‌ తీవ్రత కొనసాగింది. నవంబర్‌ నుంచి పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి పదిలక్షల కేసులు నమోదైన తేదీలు ఇలా ఉన్నాయి..

తేదీ             కేసులు
17 జులై         10లక్షల మార్కు దాటింది.
07 ఆగస్టు       20లక్షలు
23 ఆగస్టు       30లక్షలు
05 సెప్టెంబర్‌    40లక్షలు
16 సెప్టెంబర్‌    50లక్షలు
28 సెప్టెంబర్‌    60లక్షలు
11 అక్టోబర్‌      70లక్షలు
29 అక్టోబర్‌      80లక్షలు
20 నవంబర్‌     90లక్షలు
18 డిసెంబర్‌     99.79లక్షలు కేసులు నమోదయ్యాయి.

2వేలు దాటిన టెస్టింగ్‌ కేంద్రాలు..
దేశంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేసేందుకు టెస్టుల సంఖ్యను భారీగా పెంచాల్సిన అవసరాన్ని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది. జనవరి 23వరకు దేశంలో ఒకేఒక్క టెస్టింగ్‌ కేంద్రం ఉండగా మార్చి 23కు ఆ సంఖ్య 160కు పెంచింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 2264 కేంద్రాలకు ఐసీఎంఆర్‌ అనుమతినిచ్చింది. వీటిలో 1195 ప్రభుత్వ ల్యాబ్‌లు ఉండగా, 1069 ల్యాబ్‌లు ప్రైవేటు ఆధ్వర్యంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నాయి. వీటి ద్వారా నిత్యం దాదాపు 10లక్షలకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఇప్పటివరకు 15కోట్ల 89లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) పేర్కొంది. 

వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య ఇలా.. 

దేశం    కేసుల సంఖ్య     మరణాలు

అమెరికా  1,72,14,177     3,10,801
భారత్‌     99,79,447     1,44,789
బ్రెజిల్‌     71,10,434      1,84,827
రష్యా     27,46,843        49,170
మెక్సికో    12,89,298      1,16,487

ఇవీ చదవండి..
కొవిడ్‌19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు
గుజరాత్‌లో మరో ప్రాణాంతక వ్యాధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని