బోయింగ్‌ లోపాలను దాచింది..!

విమానంలో నిర్మాణాత్మక లోపాలున్నప్పటికీ ఆ విషయాన్ని పైలట్లకూ, విమాన రెగ్యులేటరీ సంస్థలకు బోయింగ్‌ సంస్థ చెప్పలేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు అమెరికా హౌస్‌ నియమించిన రావాణా, మౌలికసదుపాయాల కమిటీ ఓ నివేదికను అందజేసింది. ‘‘ చికాగో కేంద్రంగా అభివృద్ధి చేసిన బోయింగ్‌...

Published : 17 Sep 2020 20:38 IST

న్యూయార్క్‌: విమానంలో లోపాలున్నట్లు తెలిసినా ఆ విషయాన్ని పైలట్లకూ, విమాన రెగ్యులేటరీ సంస్థలకు బోయింగ్‌ సంస్థ చెప్పలేదని అమెరికా ప్రభుత్వ కమిటీ తెలిపింది. ఈ మేరకు అమెరికా ప్రతినిధుల సభకు చెందిన రవాణా, మౌలికసదుపాయాల కమిటీ ఓ నివేదికను అందజేసింది. ‘‘చికాగో కేంద్రంగా అభివృద్ధి చేసిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు కూలిపోవడానికి నిర్మాణలోపంతో పాటు సాంకేతిక సమస్యలు, కమ్యూనికేషన్స్‌ కూడా కారణమయ్యాయి’’ అని కమిటీ సభ్యులు వెల్లడించారు. దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని తేల్చారు. ఈ మేరకు 245 పేజీల నివేదికను హౌస్‌ ముందుంచారు.

‘‘బోయింగ్‌ సంస్థ ఇంజినీర్లు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలో లోపాల వల్లే వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ మార్గదర్శకాలను బోయింగ్‌ సంస్థ సరిగా పాటించలేదు’’ అని కమిటీ పేర్కొంది. 2019లో లయన్‌ ఎయిర్‌, ఇథియోపియన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు వేర్వేరు విమాన ప్రమాదాల్లో 346 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇటీవల కేరళలోని కోజీకోడ్‌ విమానాశ్రయంలో ‘ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ విమానం’ అనూహ్యంగా అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ విమానం కూడా బోయింగ్ 737 రకానికి చెందినదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని