అత్యంత ఎత్తులో.. చైనా డేటా సెంటర్‌..!

అత్యంత ఎత్తైన ప్రదేశంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చైనా సమాయత్తమవుతోంది. ఇందుకోసం టిబెట్‌లోని ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకొంది.

Published : 29 Oct 2020 21:23 IST

బీజింగ్‌: అత్యంత ఎత్తైన ప్రదేశంలో డేటా సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు చైనా సమాయత్తమవుతోంది. ఇందుకోసం టిబెట్‌లోని ఎత్తైన ప్రాంతాన్ని ఎంచుకొంది. ఈ డేటా సెంటర్‌ దాదాపు 3656 మీటర్ల ఎత్తైన ప్రదేశంలో ఉన్న లాసా నగరంలో నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తోన్న ఈ డేటా సెంటర్‌  ప్రపంచంలోనే మొదటిది. దాదాపు రూ.12వేల కోట్ల పెట్టుబడితో చైనా ఈ డేటా సెంటర్‌ నిర్మాణం జరుపుతున్నట్లు అధికారిక మీడియా షిన్‌హువా వెల్లడించింది. దీంతో చైనాతో పాటు దక్షిణాసియా దేశాలైన నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాల సమాచార నిక్షిప్త కేంద్రాల (డేటా సెంటర్ల) అవసరాలను తీరుస్తుందని చైనా అధికారిక మీడియా తెలిపింది. 

ఈ ప్రాజెక్టులో భాగంగా వీడియో రెండరింగ్‌, అటానామస్‌ డ్రైవింగ్‌, డిస్టాన్స్‌-లెర్నింగ్‌ డేటా బ్యాకప్‌ వంటి సేవలను అందిచనున్నట్లు స్థానిక నింగ్‌ సువాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ వెల్లడించింది. ఈ సేవలను చైనాలోని ప్రావిన్సులు, నగరాలతో పాటు నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాలకు కూడా అందించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ కార్యకలాపాలు 2021లో ప్రారంభమవుతాయని నింగ్‌ సువాన్‌ సంస్థ వెల్లడించింది. 

తొలిదశ నిర్మాణం అనంతరం ముఖ్యమైన క్లయింట్‌ల డేటా అవసరాలు తీర్చేందుకు ఈ సెంటర్‌లో 10వేల మెషిన్‌ క్యాబినెట్‌లు అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. వీటి వార్షిక ఆదాయం కూడా 1.5 బిలియన్‌ యువాన్‌లు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ సేవలను అందించడంలో ఈ ప్రాంతీయ కార్యాలయం కీలకంగా మారడంతో పాటు లాసా నగరం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందని నింగ్‌సువాన్‌ టెక్నాలజీ గ్రూప్‌ చీఫ్ మార్కెటింగ్‌ అధికారి వాంగ్‌జున్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా బిగ్‌-డేటా పారిశ్రామిక కేంద్రంగా టిబెట్‌ మారుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని