ఆగస్టు 15 తరవాతే అక్కడ 4జీ సేవలు

ట్రయల్ ఆధారంగా జమ్ముకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Published : 11 Aug 2020 16:30 IST

 మొదట రెండు జిల్లాల్లోనే

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని రెండు జిల్లాల్లో ఆగస్టు 15 తరవాత నుంచి 4జీ సేవలకు అనుమతిస్తామని కేంద్రం మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖకు దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో ఈ సడలింపునకు అనుమతి ఉండదని, ఉగ్రవాద కార్యకలాపాల తీవ్రత తక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని తెలిపింది. రెండు నెలల తరవాత ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తుందని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కట్టబెట్టే రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడంతో పాటు, జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడదీస్తూ చేసిన చట్టం కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని 4జీ ఇంటర్నెట్ సేవలను నిలివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికి ఈ నిషేధం విధించి సంవత్సరం దాటిపోయింది.  

కాగా, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఇంటర్నెట్ మీద ఆంక్షలు కరోనావైరస్‌ చికిత్స, విద్య, వ్యాపారం మీద ఎలాంటి ప్రభావం చూపడంలేదన్నారు. మొబైల్‌ ఫోన్లలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను పునరుద్ధరించే విధంగా ఇంకా పరిస్థితులు అదుపులోకి రాలేదని వివరించారు. కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను పునరుద్ధరించే అవకాశాలను పరిశీలించాలని శుక్రవారం సుప్రీం కోర్టు జమ్ముకశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది. కొద్దిరోజుల క్రితమే కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ నియామకం జరగడంతో ఆ అంశంపై సూచనలు తీసుకోవడానికి తమకు కొంచెం సమయం కావాలని అక్కడి ప్రభుత్వం సుప్రీంను విజ్ఞప్తి చేసింది. ఇటీవల మనోజ్‌ సిన్హా జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని