పంజాబ్‌ కొత్త కేసుల్లో 81శాతం బ్రిటన్‌ రకానివే..!

పంజాబ్‌లో కొన్ని నమూనాలను పరిశీలించగా వాటిలో 81శాతం బ్రిటన్‌ రకానికి చెందినవేనని వెల్లడైంది.

Published : 23 Mar 2021 16:46 IST

అప్రమత్తంగా ఉండాలన్న పంజాబ్‌ సీఎం

ఛండీగఢ్‌: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మరోసారి పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు దేశంలో వెలుగు చూస్తోన్న కొత్తరకం కరోనా వైరస్‌లే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో కొన్ని నమూనాలను పరిశీలించగా వాటిలో 81శాతం బ్రిటన్‌ రకానికి చెందినవేనని వెల్లడైంది. దీంతో అప్రమత్తమైన పంజాబ్‌ ప్రభుత్వం, దీన్ని ఎదుర్కోవడంలో భాగంగా యువతకూ వ్యాక్సిన్‌ అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న రాష్ట్రాల జాబితాలో పంజాబ్‌ కూడా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే వెల్లడించింది. దీంతో అక్కడ 401 నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేపట్టగా, వీటిలో 81శాతం కేసులు బ్రిటన్‌ రకానికి చెందినవిగా నిర్ధారణ అయినట్లు పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వెల్లడించారు. యువకులకూ ఈ రకం వైరస్‌ సోకే ప్రమాదం ఎక్కువున్న ఉన్నందున వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సినేషన్‌లో 60ఏళ్లకంటే తక్కువ వయసున్న వారికి కూడా పంపిణీ చేయాలని పంజాబ్‌ సీఎం కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలు ఈ కొత్తరకం వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని తేలిన నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగించాలని సూచించారు.

నిబంధనలు పాటించకుంటే మరిన్ని ఆంక్షలు..

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత పెరుగుతోన్న దృష్ట్యా ప్రజలు మాస్కులు, భౌతిక దూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటించాలని పంజాబ్‌ ముఖ్యమంత్రి మరోసారి సూచించారు. వైరస్‌ను కట్టడి చేసేందకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు అమలు చేస్తోందని, ఒకవేళ ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే మరిన్ని కఠిన ఆంక్షలు విధించాల్సి వస్తుందని అమరీందర్‌ సింగ్‌ హెచ్చరించారు. ఇదిలాఉంటే, దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోన్న దృష్ట్యా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 45ఏళ్ల వయసు పైబడినవారు కూడా వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకు దేశంలో 4కోట్ల 84లక్షల కొవిడ్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని