Delhi Pollution: ప్రతి ఐదింట నాలుగు బాధిత కుటుంబాలే!

దేశ రాజధాని దిల్లీతోపాటు పరిసరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం, మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తుండటంతో.. స్థానికంగా పరిస్థితులు దిగజారాయి. దీంతో అక్కడుంటున్నవారు...

Published : 08 Nov 2021 20:36 IST

దిల్లీ- ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యం పరిణామాలపై ఓ సర్వేలో వెల్లడి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీతోపాటు పరిసరాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం, మరోవైపు పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తుండటంతో.. స్థానికంగా పరిస్థితులు దిగజారాయి. దీంతో అక్కడుంటున్న వారు శ్వాస సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇదే విషయమై కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘లోకల్‌ సర్కిల్స్‌’.. దిల్లీ- ఎన్‌సీఆర్‌లో నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఇక్కడి ప్రతి ఐదింట నాలుగు కుటుంబాల్లోని సభ్యులు కలుషిత గాలి కారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది! ఈ దీపావళికి బాణసంచా సరఫరా, విక్రయాలపై నిషేధాన్ని అమలు చేయడంలో అధికారులు అసమర్థంగా వ్యవహరించారని 91 శాతం మంది తెలిపినట్లు వెల్లడైంది.

అనారోగ్య సమస్యలతో సతమతం..

సర్వేలో భాగంగా దిల్లీ, గురుగ్రామ్‌, నొయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌ ప్రాంతాల్లో 34 వేల కంటే ఎక్కువ మందిని ఆయా అంశాలపై ప్రశ్నలు అడిగారు. స్థానికంగా వాయు నాణ్యత దిగజారినందున.. వారం రోజులుగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను ఆరా తీశారు. ఈ క్రమంలో వెల్లడైన వివరాలు..

* 16 శాతం మందికి గొంతు నొప్పి లేదా దగ్గు ఉంది.

* మరో 16 శాతం మందికి ముక్కు కారడం, కళ్ల మంట సమస్యలు ఎదురయ్యాయి.

* 16 శాతం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతోంది.

* పైన పేర్కొన్న అన్ని లక్షణాలు కనిపించినవారు 24 శాతం మంది ఉన్నారు. ఎనిమిది శాతం మంది కనీసం రెండు లక్షణాలతో బాధ పడ్డారు.

* మాపై ఎటువంటి ప్రభావం పడలేదని చెప్పిన వారు 20 శాతం.

* దాదాపు 22 శాతం మంది తాము లేదా తమ ఇంటి సభ్యులు ఇప్పటికే వైద్యులు, ఆసుపత్రులను సందర్శించినట్లు చెప్పారు. 

* 28 శాతం కుటుంబాలు మాత్రమే ప్రస్తుత పరిస్థితిని ఎదుర్కోవడానికి ఎయిర్ ప్యూరిఫయర్‌లను వినియోగించాలని ఆలోచిస్తున్నాయి. 61 శాతం కుటుంబాలు యాంటీ పొల్యూషన్ మాస్కుల వాడకానికి మొగ్గుచూపుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని