covid: సామూహిక రోగ నిరోధకత ఎప్పటికైనా సాధ్యమవుతుందా?

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా కార్యక్రమం వేగవంతం కావడంతో ప్రజలు  మళ్లీ మనం కొవిడ్‌ పూర్వపు రోజులకు ఎప్పుడెప్పుడు వెళతామా అని ఎదురు చూస్తున్నారు. 

Updated : 29 Jul 2021 14:49 IST

కొవిడ్‌ పూర్వస్థితికి చేరుకునేందుకు ఎంతకాలం పడుతుందోనని ఆందోళన!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ టీకా కార్యక్రమం వేగవంతం కావడంతో ప్రజలు  మళ్లీ మనం కొవిడ్‌ పూర్వపు రోజులకు ఎప్పుడెప్పుడు వెళతామా అని ఎదురు చూస్తున్నారు. కానీ  ఆ రోజులకు వెళ్లాలంటే హెర్డ్‌ ఇమ్యూనిటీ రావాలంటున్నారు. నిజంగా మానవాళి దాన్ని సాధించగలదా? సామూహిక రోగ నిరోధకతను ప్రభావితం చేసే అంశాలేవో చూద్దాం.

సామూహిక రోగ నిరోధకతకు ఎంతమందిలో యాంటీబాడీలు ఉండాలి?

జనాభాలో కనీసం మూడువంతులకు పైగా కొవిడ్‌ నుంచి ఇమ్యూనిటీ వచ్చినట్లయితే ఆ తర్వాత వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు. మొదట్లో రోగనిరోధకత పరిమితి(త్రెషోల్డ్‌)ని చేరుకోవాలంటే దాదాపు జనాభాలో 60 నుంచి 70 శాతానికి టీకాల ద్వారాగాని, ఇన్‌ఫెక్షన్‌ సోకడం వల్లగానీ రోగనిరోధకత రావాలన్నారు. కానీ వివిధ వ్యాధులకు రోగనిరోధకత పరిమితి వేర్వేరుగా ఉంటుంది. మీజిల్స్‌(తట్టు)కు సామూహిక రోగ నిరోధకత రావాలంటే, 92 నుంచి 94 శాతంగా యాంటీబాడీలు ఉండాలి. పోలియోలో ఇది 80 నుంచి 86 శాతం ఉంటుంది. ఆ విధంగానే కొవిడ్‌కు సంబంధించి హెర్డ్‌ ఇమ్యూనిటీ త్రెషోల్డ్‌ను 80 నుంచి 88 శాతంగా ఇటీవల నిపుణులు అంచనా వేశారు. మరికొందరు కొవిడ్‌ ఎప్పుడూ మనతోపాటే ఉంటుందని, కాకపోతే దాని తీవ్రత తగ్గిపోవచ్చని అంటున్నారు.

వ్యాక్సిన్లు, వైరస్‌ వేరియంట్లలోనూ తేడాలతో అది కష్టమే!

మొదట్లో కొవిడ్‌ వ్యాప్తి రేటు ఒక మనిషి నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి జరిగేది. కానీ డెల్టా రకం రాకతో ఇది 4 నుంచి 6 మందికి వ్యాపించసాగింది.  ఇక బ్రిటన్‌లో ఫైజర్‌ వ్యాక్సిన్‌ 85 నుంచి 95 శాతం ప్రభావం చూపుతుందని తేల్చారు. అదే సమయంలో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ 70 నుంచి 85 శాతం వరకు ప్రభావం చూపుతోందని చెప్పారు. అయితే డెల్టా వైరస్‌ మొత్తం వ్యాక్సిన్‌ ప్రభావాన్ని 10 శాతం మేర తగ్గించింది. ఇలా వ్యాక్సిన్లు, వైరస్‌ వేరియంట్లలో తేడాల వల్ల సామూహిక రోగ నిరోధకత కష్టమవుతోంది. వ్యాక్సిన్‌ ప్రభావం తక్కువైనకొద్దీ, జనాభాలో ఎక్కువమందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతోంది.

పిల్లల వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమే కాలేదు!

ఇంతవరకూ కనీసం సగం జనాభాకు కూడా వ్యాక్సిన్లు చాలా దేశాల్లో ఇవ్వలేదు. అలాగే పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రారంభమే కాలేదు. ఇంకా ప్రయోగ దశల్లోనే ఉన్నాయి.  ఇటీవల డెల్టా వేరియంట్‌ బారిన ఎక్కువమంది పిల్లలు కూడా పడినట్టు తేలింది. కాబట్టి జనాభా మొత్తానికి వ్యాక్సిన్లు ఇచ్చేంతవరకూ సామూహిక రోగ నిరోధకత గురించి అసలు ఆలోచించలేం.

వ్యాక్సిన్ల నుంచి వచ్చే రక్షణ దీర్ఘకాలం ఉండట్లేదు!

వ్యాక్సిన్లు తీసుకున్నవారిలోనూ కాలం గడిచినకొద్దీ యాంటీబాడీలు తగ్గిపోవటం వల్ల కూడా హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం కష్టమనిపిస్తుంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు కొవిడ్‌ కొత్త రకాలు ప్రబలుతుండటంతో, వ్యాక్సిన్లను మళ్లీ మళ్లీ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అలాగే అందరికీ కాలానుగుణంగా బూస్టర్‌ డోసులు ఇవ్వాల్సి ఉంటుంది.  కొత్త వేరియంట్లు సామూహిక రోగ నిరోధకత అంచనాలనే తల్లకిందులు చేస్తున్నాయని న్యూ మెక్సికోలోని లాస్‌ అలమోస్‌ నేషనల్‌ లేబొరేటరీకి చెందిన నిపుణురాలు సారా డెల్‌ వాల్లె తెలిపారు. మనం కొత్త వేరియంట్లతో పరుగుపందెంలో ఉన్నామని ఆమె చెప్పారు.  బ్రెజిల్‌లోని మనాస్‌లో జూన్‌ 2020నాటికే 60 శాతం మందికిపైగా కొవిడ్‌ బారిన పడ్డారు.  అక్కడివారంతా హెర్డ్‌ ఇమ్యూనిటీకి చేరువలో ఉన్నారనుకుంటుంటే గత జనవరిలో కొత్త వేరియంట్‌ తీవ్రంగా విజృంభించింది.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌తోనే సాధ్యం

దేశీయంగా అర్హులందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడమేగాక, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నప్పుడే మహమ్మారి మూకుమ్మడిగా విరుచుకుని పడకుండా కట్టడం చేయగలం. ‘‘ప్రపంచవ్యాప్తంగా  వ్యాక్సిన్ల అసమాన పంపిణీ, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభించడంలో చాలా తేడాలు ఉన్నాయి. అలాంటప్పుడు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడం కష్టం’’ అని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీలోని అంటువ్యాధుల నిపుణులు మట్‌ ఫెర్రారి పేర్కొన్నారు. ఒకవేళ పూర్తిగా వ్యాక్సినేషన్‌ చేసినా కూడా కొవిడ్‌ ప్రబలుతుంటుంది. కానీ దాని తీవ్రత తగ్గి, అది స్థానికంగా మాత్రమే ఉంటుంది. నగరాలకు నగరాలు, దేశాలకు దేశాలు కొవిడ్‌ బారిన పడటం ఆ తర్వాత ఉండకపోవచ్చు. కొవిడ్‌ మనతోపాటే ఫ్లూ వైరస్‌లాగా ఉండిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అసలు హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమేనా?

ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేసిన దేశాల్లో ఇజ్రాయెల్‌ ముందున్న విషయం తెలిసిందే. అయినా ఆ దేశంలో ఇటీవల డెల్టా వేరియంట్‌ విరుచుకుపడింది.  ‘‘వైరస్‌ వ్యాప్తిని దాదాపు పూర్తిగా అరికట్టే అత్యంత సమర్థవంతమైన వ్యాక్సిన్‌ వచ్చినప్పుడే హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించవచ్చు. లేకపోతే తప్పనిసరిగా జనాభాలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీకి చెందిన శ్వేతా బన్సాల్‌ అన్నారు.  కానీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా దేశాల్లో నత్తనడకన జరుగుతోంది. అంతేకాదు, గ్రామీణుల్లో చాలామంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం అవసరానికి తగినంతగా సరఫరా కూడా లేదు. తప్పనిసరి వ్యాక్సిన్‌ పద్ధతి అమలులో లేకపోవడం వల్ల స్వచ్ఛందంగా వ్యాక్సిన్‌ తీసుకునేవారి సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. అదే గనక జరిగితే హెర్డ్‌ ఇమ్యూనిటీ అనేది ఎప్పటికీ అందని ద్రాక్షలాగే ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని