waterfalls: ఉప్పొంగిన జలపాతం.. తల్లీబిడ్డల కోసం యువకుల సాహసం!

తమిళనాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతం వద్ద చిక్కుకున్న తల్లి బిడ్డలను స్థానికులు అతికష్టం మీద కాపాడారు.....

Published : 27 Oct 2021 01:13 IST

చెన్నై: తమిళనాడులో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతం వద్ద చిక్కుకున్న తల్లి బిడ్డలను స్థానికులు అతికష్టం మీద కాపాడారు. సేలం జిల్లాలోని అనైవరి జలపాతం చూసేందుకు వచ్చిన తల్లిబిడ్డలు.. ప్రమాదవశాత్తు ప్రవాహం వద్ద చిక్కుకుపోయారు. అది గమనించిన స్థానికులు తాళ్ల సాయంతో ఇద్దరినీ  పైకి లాగి రక్షించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి గ్రామస్థులు చేసిన సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్  కూడా వారిపై ప్రశంసలు కురిపించారు.

కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, వరుస సెలవులు రావడంతో తమిళనాడు సేలం జిల్లాలోని అనైవారి జలపాతానికి భారీగా పర్యాటకులు పోటెత్తారు. అయితే పర్యాటకులు చూస్తుండగానే జలపాతం ఉగ్రరూపం దాల్చడంతో.. అప్పటివరకు అక్కడ నీటితో ఆడుకుంటున్న జనం పరుగులుపెట్టారు. జలపాతం అందాలను చూసేందుకు వచ్చిన ఓ మహిళ తన బిడ్డతోపాటు ఈ ప్రవాహంలో చిక్కుకుపోయింది. ఇది గమనించిన అక్కడివారు ఆమెను రక్షించాలంటూ పెద్దఎత్తున కేకలు పెట్టారు. స్థానికులు ప్రాణాలకు తెగించి ఆ మహిళను కాపాడేందుకు సిద్ధమయ్యారు. అతి కష్టం మీద తాళ్ల సాయంతో ఆ ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రయత్నంలో ఓ ఇద్దరు గ్రామస్థులు కాలు జారి నీటి ప్రవాహంలో పడిపోయారు. కానీ, వారు సమీపంలోని ఒడ్డుకు ఈదుకుంటూ రాగా.. అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సత్కరించనున్న ముఖ్యమంత్రి

ఈ ఘటనతో అధికారులు అనైవారి జలపాతం వద్ద తాత్కాలికంగా నిషేధం విధించారు. తల్లీకూతుళ్లను కాపాడిన వారిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొనియాడారు. ప్రాణాలకు తెగించి వారిని కాపాడటం అభినందనీయమని మెచ్చుకున్నారు. ప్రభుత్వం తరఫున వారిని ప్రత్యేకంగా సత్కరిస్తామని తెలిపారు. విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని